KTR | సంపూర్ రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వంద శాతం రుణమాఫీ ఎక్కడ జరిగిందని కాంగ్రెస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై మీరు చెప్పిన మాటల్లో నిజం ఒక్క శాతం నిజం ఉన్నా సరే.. సెక్యూరిటీ లేకుండా నీ కొడంగల్ నియోజకవర్గానికి రావాలని సవాలు విసిరారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో అయినా సరే వంద శాతం రుణమాఫీ జరిగిందని చెబితే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని అన్నారు. రాజకీయాలు వదిలేసి.. ఇంట్లోనే కూర్చుంటానని స్పష్టం చేశారు.
రుణమాఫీ జరిగిందని నువ్వు చెప్పింది నిజమైతే కొడంగల్‌లో ఏ ఒక్క గ్రామంలో అయినా చర్చ పెడదామని కేటీఆర్ సవాలు విసిరారు. కొడంగల్‌లో మాత్రమే కాదని.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో చాలా ఊర్లు తిరిగి.. ఈ పచ్చి మోసాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు. దమ్ముంటే ముఖ్యమంత్రి తన సవాలును స్వీకరించాలని అన్నారు. కొడంగల్‌లో కాకుంటే ఉమ్మడి పాలమూరులోని ఏ నియోజకవర్గంలో అయినా చర్చకు రెడీనా అని తెలిపారు. నీ సొంతూరు కొండరెడ్డిపాలెంలో అయినా సరే వంద శాతం రుణమాఫీ జరిగిందని రుజువు చేయాలని సవాలు విసిరారు.
సగం కూడా రుణమాఫీ చేయకుండా వంద శాతం చేశామని చెప్పుకోవడం సంపూర్ణంగా దిగజారడమే అని కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని చాలామంది రైతులు ఆందోళనలో ఉంటే.. సంబరాలు చేసుకుంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ పచ్చి మోసం, దగా అని పునరుద్ఘాటించారు. రైతులను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో రంకెలు వేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైనట్లు ఉంది.. అదే రేవంత్ అమెరికా టూర్ ఆ స్థాయిలో వర్కవుట్ అయినట్టు లేదు.. దీంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని అన్నారు. పైగా రేవంత్ రెడ్డి లేని టైమ్‌లో తిరుపతి రెడ్డి ప్రచారం కూడా బాగానే జరిగిందని చెప్పారు. కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకెళ్తున్నారనే బాధనా? తాను లేనప్పుడు భట్టి చాలా తిరిగారని భయమో? అధిష్ఠానం ఏదైనా అదిలిస్తుందేమోనని భయమో తెలియదు గానీ.. మొత్తానికి ఆ ఫ్రస్ట్రేషన్లో రంకెలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పంద్రాగస్టుకు స్పీచ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెప్పారని కేటీఆర్ అన్నారు. ఈ విషయం తమకు తెలియక.. పిచ్చోళ్లలెక్క ఇన్ని రోజులు ఉత్తర భారతదేశానికి వెళ్లామని ఎద్దేవా చేశారు. ఇంత గొప్ప ముఖ్యమంత్రిని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం కలుగుతుందని కేటీఆర్ అన్నారు. పాపం ఆయనకు ఏదో అయినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే వైద్యులకు చూపించాలని ఆయన కుటుంబసభ్యులకు సూచించారు. పిచ్చోడి చేతిలో రాయిలా మారితే రాష్ట్రానికి ప్రమాదమని అన్నారు. రేవంత్‌కు సంబంధించిన అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆయనలో అసహనం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని విమర్శించారు. దీంతో తిట్లు, బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. లాగులో తొండలను తోలుతా, చెట్టుకు కట్టేస్తా, చంపేస్తా, నరికేస్తా, ఏట్ల దుంకు, గుడ్లతో గోళీలు ఆడుతా అనే మాటలు మానేయాలని రేవంత్‌కు సూచించారు. నువ్వు కాదు.. సెక్యూరిటీ లేకుండా వెళ్తే రైతులే నిన్ను ఫుట్‌బాల్ ఆడతారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు అన్నారని గుర్తుచేశారు. రుణమాఫీ జరిగింది హరీశ్‌రావు అర్జెంట్‌గా రాజీనామా చెయ్యి అని చిల్లరగాళ్లు పోస్టర్లు పెట్టారని అన్నారు. రుణమాఫీ ఎక్కడ జరిగిందో చెప్పించాలని సవాలు విసిరారు. ఒక విజన్ లేదు, విధానం లేదు, డొల్ల మాటలు, కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని అన్నారు.