KTR : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సాగు, తాగు నీటికి గోస లేకుండా చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లుగానే తెలంగాణలోని ప్రతి బిడ్డ కేసీఆర్‌ని గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా తెలంగాణ రైతులు కన్నీళ్లనే తప్ప సాగునీళ్లను చూడలేరని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి రూపొందించిన కాళేశ్వరం డాక్యుమెంటరీని తెలంగాణభవన్‌లో ఆవిష్కరించిన కేటీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కామధేనువు, కల్పతరువు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టుకు గతంలోనే కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపేందుకు సీఎం రేవంత్ ఇప్పుడు ఆ ప్రాజెక్టు అంచనాలను ఏడు రెట్లు పెంచి రూ.7,400 కోట్లకు పెంచారని ఆరోపించారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘తెలంగాణకు కరువొచ్చినా నీటి గోస లేకుండా చేసే ప్రాజెక్టు కాళేశ్వరం. 85 పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి లక్ష కోట్ల కుంభకోణం అంటే ఆయనకు పిల్లనిచ్చిన మామ మాత్రం అదేంలేదని కొట్టి పారేసిండు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకైన ఖర్చు రూ.93,769 కోట్లు. అందులో మేడిగడ్డ బరాజ్‌కు భూసేకరణతో కలుపుకుని అయిన ఖర్చు రూ.4 వేల కోట్లు. సిమెంట్ నిర్మాణానికి రూ.1,500 కోట్లు మాత్రమే ఖర్చయింది. ఏడవ బ్లాక్‌లో కుంగిన రెండు పిల్లర్లను పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చు రూ.300 కోట్లు. బరాజ్‌ను నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థనే తన పైసలతో పునర్నిర్మిస్తాం అంటుంది. ఇక ఇందులో ప్రజాధనం ఎక్కడ వృథా అయ్యింది..?’ అని ప్రశ్నించారు.
‘కమిషన్ పేరుతో మూడు కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయింది రేవంత్ ప్రభుత్వం. మేడిగడ్డకు రిపేర్లు ఎందుకు చేయడం లేదని అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు ఎలా తెస్తారని ఓవైసీ అడిగితే ముఖ్యమంత్రి గుడ్లు తేలేసిండు. తెలంగాణ తలరాత మార్చిన కేసీఆర్ పనితనాన్ని ప్రపంచం ముందు ఘనంగా చెప్పుకోవడంలో పార్టీగా విఫలమయ్యాం. స్వాతంత్రానికి పూర్వం పోలవరం ఆలోచన మొదలైంది. 1940లో పోలవరం ప్రాజెక్టు కట్టాలని అనుకుంటే.. 80లో శంకుస్థాపన జరిగింది. 2004లో డిజైన్లు గీశారు. 2014లో పనులు మొదలయ్యాయి. కానీ ఇప్పటికీ ఇంకా ఆ ప్రాజెక్టు పూర్తికాలేదు. అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన చేసి కేవలం ఆరు సంవత్సరాల్లోనే కేసీఆర్ దాన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వల్పకాలంలో నిర్మించిన కేసీఆర్ పనితనానికి, ఇతర ముఖ్యమంత్రుల పనితనానికి ఇంతకుమించిన ఉదాహరణ ఉండదు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
పోచంపాడు ప్రాజెక్టు కింద ఉన్న ఆర్మూరు నియోజకవర్గంలోని చివరి మడికే నీళ్లు రాకపోయేవి. సముద్రమట్టానికి 110-120 మీటర్ల ఎత్తులో కృష్ణానది ప్రవహిస్తే, గోదావరి 80 నుంచి 100 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది. సముద్రమట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నదిని మేడిగడ్డ దగ్గర ఒడిసిపట్టి సముద్రమట్టానికి 535 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్‌కు తీసుకొచ్చిన బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం. 15 గొలుసుకట్టు రిజర్వాయర్లు,19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌస్‌లు, వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు, వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువల సమాహారమే కాళేశ్వరం. హైదరాబాద్ నెత్తి మీద ఉన్న నీటి కుండ కొండపోచమ్మ సాగర్‌తో ఇంకో 50 ఏళ్ల వరకు నగరానికి తాగునీటి కొరత రాదు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారం తప్పని నిరూపించేందుకు రాకేష్ రెడ్డి చేసిన ప్రయత్నం అభినందనీయం. రాకేష్ రెడ్డి రూపొందించిన ‘ఈ కాళేశ్వరం’ డాక్యుమెంటరీని తెలంగాణలోని ప్రతి గడపకు తీసుకపోతాం. ప్రతి ఒక్కరికి చూపిస్తాం’ అని కేటీఆర్ అన్నారు.