రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : ‘సిరిసిల్ల నేతన్నల కోసం ప్రవేశపెట్టిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని సంక్రాంతి పండుగలోగా అమలు చేయాలి. లేదంటే 10 వేల మంది కార్మికులతో సర్కార్‌ను కదిలించేలా మహాధర్నా చేపడుతాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం ఇచ్చారు. అర్హులైన నేత కార్మికుల జాబితాను సిద్ధం చేసి, సబ్సిడీపై వపర్లూంలు కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుడిని ఆసామిని చేయాలన్న ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా గత కేసీఆర్ ప్రభుత్వం 200 ఎకరాల్లో రూ.400 కోట్లతో చేపట్టిన ఈ వర్కర్ టు ఓనర్ అద్భుత పథకాన్ని వృథా చేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. ఈ పథకం అమలు చేయాలని అసెంబ్లీ సమావేశంలో సర్కార్‌ను నిలదీస్తానని చెప్పారు. నేతన్నలు ధైర్యం కోల్పోవద్దని, అండగా తానున్నానని భరోసా ఇచ్చారు. బుధవారం కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. మధ్యామ్నం 2 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ కాసేపు పార్టీ కార్యకర్తలు, నేతలతో మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మదీనా యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కేటీఆర్ కప్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో హాజరయ్యారు. గెలిచిన అన్నారం-11 జట్టు విజేతలకు బహుమతులను అందజేశారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి రెండో బైపాస్‌రోడ్డులో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటుచేసిన వర్కర్ టు ఓనర్ పథకం షెడ్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కార్మికుడిని యజమానిగా మార్చే వర్కర్ టు ఓనర్ పథకం ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని కేటీఆర్ తెలిపారు. ఈ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. నేతన్నల కోసం నిర్మించిన వర్క్ షెడ్లలో నిర్వహణ లోపంతో పిచ్చిమొక్కలు మొలిచాయని, దుర్గంధం వ్యాపిస్తున్నదని పేర్కొంటూ మీడియాకు స్వయంగా చూపించారు. దురుద్దేశపూర్వకంగానే రెండేండ్లుగా తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. నేతన్నల కోసం నిర్మించిన షెడ్లలో నేడు తొండలు గుడ్లు పెడుతున్నాయని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, సంక్రాంతిలోగా ‘వరర్ టు ఓనర్’ పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పవర్ లూమ్లను సబ్సిడీపై కొనుగోలు చేయడానికి నిధులను కేటాయించాలని సూచించారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభ సమయంలో నేతన్నలకు మనోధైర్యం కల్పించేందుకు, ఆత్మహత్యలను నివారించేందుకు కేసీఆర్ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి భరోసా కల్పించారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయన చూపిన దూరదృష్టి, మానవీయత, రాజకీయ సంకల్పం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ ఉన్నప్పుడు 2005లోనే సిరిసిల్ల నేతన్నల దుస్థితిని ఆ యన గుర్తించారని చెప్పారు. ఒక వారం వ్యవధిలో తొమ్మిది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో చలించిపోయారని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలపై దయలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి రావాలనే ఉద్దేశంతో, పార్టీ తరఫున రూ.50 లక్షలు సిరిసిల్ల పద్మశాలి సమాజానికి అందజేసి ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రూ.3,400 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్లను అందించి నేతన్నల బతుకులను మార్చడమే కాకుండా, తెలంగాణ ఆడబిడ్డలకు పండుగ కానుకగా చీరలు అందించిన గొప్ప ఆలోచన ఆయనదేనని కేటీఆర్ వివరించారు. ఏటా కోటి మంది మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్దేనని గుర్తుచేశారు. ఒకప్పుడు నేత కార్మికులు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే సంపాదిస్తూ కుటంబాన్ని సాకలేక ఇబ్బందులు పడేవారని, నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పెంచేలా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోనే సిరిసిల్ల దశ తిరిగిందని చెప్పారు. నేత కుటుంబాల్లోని మహిళలు బీడీలు చుడుతూ తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురొంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు రూ.2 వేల పింఛన్లు అమలు చేయడంతోపాటు కార్మికులకు ఇచ్చిన వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లతో నేతన్నలకు స్థిరమైన ఆదాయం లభించిందని తెలిపారు.
బీడీ కార్మికులు, నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటుచేసిన అప్పారెల్ పార్కులో పరిశ్రమలను తెప్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలోనే గ్రీన్నిడిల్, టెక్స్‌పోర్టు కంపెనీలు తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో దాదాపు 2,000 మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ గానీ, ఒక్క యూనిట్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. బీడీలు చుడుతూ ఆరోగ్యాన్ని కోల్పోతున్న మహిళలకు మంచి వాతావరణంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సిరిసిల్లలో నాడు 200 ఎకరాల్లో అప్పారెల్ పారును ఏర్పాటు చేశామని తెలిపారు. వర్కర్ టు ఓనర్ పథకంలో 1,500 మంది నేత కార్మికులను యజమానులుగా, అప్పారెల్ పారులో 25 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు తెలిపారు.
సిరిసిల్ల వెంకంపేటలో గల ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి కేటీఆర్ బుధవారం ముందస్తుగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొన్నారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సందడి చేశారు. న్యూ ఇయర్ కానుకగా వసతి గృహంలో ఉన్న 57 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లను అందజేసి, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ జర్నలిస్టుల పక్షాన నిలుబడుతానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో 252ను సవరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు లాయక్‌పాషా ఆధ్వర్యలో జర్నలిస్టులు కేటీఆర్‌ను కలిశారు. జీవో 252ను సవరించాలని, తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆయన, అసెంబ్లీలో చర్చిస్తానని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా, పట్టణ అధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాయకులు బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): జాతివివక్ష అనేది మానవత్వానికే గొడ్డలిపెట్టు అని, అది ఘోరమైన నేరమని, భారత రాజ్యాంగ విలువలకు విఘాతమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జాతివివక్ష ఏ రూపంలో ఉన్నా సహించకూడదని సూచించారు. డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజిల్ చక్మా దారుణ హత్యను ప్రస్తావిస్తూ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వివక్ష, అధికార దుర్వినియోగం కలిస్తే ఎంతటి ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన గుర్తు చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి నేరాలు కేవలం విడిగా జరిగిన సంఘటనలు కావని, ద్వేషాన్ని, వివక్షను సహించడం వల్ల కలిగే ముప్పునకు హెచ్చరికలాంటిదని పేరొన్నారు.
జాతివివక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వంపైనే నైతిక, రాజ్యాంగపరమైన బాధ్యత ఉన్నదని కేటీఆర్ గుర్తుచేశారు. జాతి వివక్షతో కూడిన మాటలు, ప్రవర్తన, రెచ్చగొట్టే చర్యలను నేరంగా పరిగణిస్తూ కఠినమైన, స్పష్టమైన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. తక్షణ అరెస్టులు, విచారణ, శిక్షలు పడేలా చట్టంలో నిబంధనలు ఉండాలని కోరారు. చట్టం తన పని తాను చేయాలని, బాధ్యత అ నేది పక్షపాతంగా ఉండకూడదని సూ చించారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వాన్ని కలిగించిందన్నారు.