KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం ప్రచురించమని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మీరిచ్చిన జాబ్ క్యాలెండర్లో ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారో స్పష్టంగా ఒక శ్వేతపత్రం ప్రకటించాలని అన్నారు.
మోతీలాల్ అనే వ్యక్తి ఉద్యోగాలకే రాస్తలేడు.. ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడని అవమానించేలా గ్రూప్‌కు ప్రిపేర్ అవుతున్న వ్యక్తిని అవమానించేలా ముఖ్యమంత్రి మాట్లాడారని కేటీఆర్ అన్నారు. ఏ కోచింగ్ సెంటర్లను అయితే ఆలంబనగా చేసుకుని నువ్వు, మీ రాహుల్‌గాంధీ వెళ్లి రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నారో.. ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను అవమానించేలా వందల కోట్లు సంపాదించుకునేందుకు పరీక్షలు వాయిదా వేయాలని మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. అందుకే తెలంగాణ యువత భగ్గుమంటున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తుందని ఎన్నో ఆశలతో ఏ యువత అయితే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిందో.. అదే యువత నిన్ను ప్రశ్నిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తయ్యి ఎనిమిదో నెలలలోకి అడుగుపెట్టిందని కేటీఆర్ అన్నారు. ఈ 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని.. మిగతా 4 నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఎట్ల ఇస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నెలబెట్టుకునేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. శాసనసభలో.. ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు. ఏ నిరుద్యోగుల్ని అయితే మోసం చేశావో.. వాళ్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఇది రెండు రాజకీయ ఉద్యోగాల సంబంధించిన పంచాయతీ కాదు.. లక్షలాది మంది యువతకు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశమని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఇకనైనా భేషజాలకు.. ఫాల్స్ ప్రెస్టేజ్కు, ఇగోకు పోకుండా.. అహంకారం తగ్గించుకుని, కండాకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ” గ్రూప్-2, గ్రూప్-3లో పోస్టుల సంఖ్య పెంచాలి. మీరు చెప్పినట్లుగా పోస్టులు పెంచి మెగా డీఎస్సీ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి. మీ పార్టీ తరఫున అసెంబ్లీలో భట్టి విక్రమార్క డిమాండ్ చేసినట్లుగా గ్రూప్-1లో ఇంటర్వ్యూలకు 1: 100 పిలవాలి. నిన్న మాట్లాడిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం ప్రచురించాలని డిమాండ్ చేస్తామన్నారు. ఒప్పుకోకపోతే వాయిదా తీర్మానం ఇచ్చయినా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు.
నిరుద్యోగుల కోసం బక్క జాడ్సన్ దీక్ష చేస్తుంటే.. ఏ ఉద్యోగం కోసం దీక్ష చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు. 2023లో గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి కూడా దీక్ష చేశాడని, ఏ ఉద్యోగం కోసం దీక్ష చేశాడని ప్రశ్నించారు. ఏ పరీక్ష రాస్తున్నాడని రేవంత్ రెడ్డి దీక్ష చేశాడు? ఏ పరీక్ష రాస్తున్నాడని రాహుల్ గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చాడు? అని నిలదీశారు. ‘ అశోక్‌నగర్‌లో ఉండే సన్నాసులు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు? మీ రాహుల్ గాంధీ అశోక్‌నగర్ వచ్చిండు.. నువ్వు వచ్చినవ్.. మీ నాయకులు అందరూ ఆ కోచింగ్ సెంటర్ల చుట్టే తిరిగారు.. ఎవరు సన్నాసులు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకుంటే బాగుంటుంది.’ అని హితవుపలికారు. వచ్చే నాలుగున్నరేళ్లు ఏ ఎన్నికలు లేవని.. ఎన్నికలు లేనప్పుడు రాజకీయ ప్రేరితమైన ఉద్యమాలు, వాళ్లను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. మీరిచ్చిన మాట మీరు నిలుపుకోవడం లేదు కాబట్టే నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. నిరుద్యోగులకు సమాధానం చెప్పే సత్తా లేక నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని సూచించారు. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రిగా గౌరవంగా మాట్లాడితే మంచిదని హితవు పలికారు.