హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆటోడ్రైవర్లు ఎదురొంటున్న ఇబ్బందులపై అధ్యయనానికి పార్టీ కార్మిక విభా గం ఆధ్వర్యంలో కమిటీని వేస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లు తమ స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలు, పరిష్కార మార్గాలు తెలుసుకొనేందుకు కమిటీ వేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ కమిటీలో కార్మిక విభాగం నాయకులు రూప్సింగ్, రాంబాబు యాదవ్, మారయ్య ఉంటారని, వీరు ఆటోడ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడుతారని పేర్కొన్నారు. ఆటోడ్రైవర్లే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఓలా, ఉబర్, ఇతర టాక్సీడ్రైవర్లతోనూ చర్చించి నివేదికను అందజేస్తారని వివరించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తామని, ఆటోడ్రైవర్ల సమస్యల పరిషారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు.