హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ శిఖండి రాజకీయాలు చేస్తున్నదని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి ధ్వజమెత్తారు. మగ ఎమ్మెల్యేల ముందు మహిళా కానిస్టేబుళ్లను, మహిళా ఎమ్మెల్యేల ముందు మగ పోలీసులను పెట్టి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు మగ పోలీసులు తమ ముగ్గురినీ తోసేశారని, దీంతో సునీతాలక్ష్మారెడ్డి కిందపడిపోయారని చెప్పారు.
ఆమె చీర లాగారని, తన జుట్టు, మెడపట్టుకొని ఈడ్చారని సబిత ఆరోపించారు. ఆ ఘటనలో తమ కు గాయాలయ్యాయని తెలిపారు. పక్కన ఉన్న తమను మగ పోలీసులు వచ్చి తోసేశార ని, వెనుక తమ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే తాము వెల్లకిలా పడిపోయేవాళ్లమని పేరొన్నారు. కానీ, మంత్రి సీతక్క మాత్రం తమపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసులు వ్యవహరించిన తీరు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
తమ పై దాడి జరిగిందన్న విషయం బయటకు వచ్చినప్పటికీ ప్రభుత్వం సభలో ప్రకటన చేయకపోవడం బాధాకరమని చెప్పారు. అసెంబ్లీ లాబీలో బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సోమవారం అసెంబ్లీ బయట తమకు జరిగిన చేదు అనుభవాలను వెల్లడించారు. సునీతాలక్ష్మారెడ్డి కిందపడిపోయిన తర్వాత కూడా ఆమెను తొకార ని సబిత ఆరోపించారు. మహిళా కానిస్టేబుళ్ల ను మగ పోలీసుల మధ్య ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. వారు ఆడబిడ్డలు కారా? వారికి కుటుంబాలు లేవా? వారిని మగవాళ్ల మధ్య లో ఎందుకు పెట్టాలి? అని నిలదీశారు.
కానీ, ఇప్పుడు మహిళా కానిస్టేబుళ్లకు ఇబ్బంది అయిందని ఆక్షేపించారు. దుస్తులు మార్చుకొని వస్తే లోపలికి అనుమతి ఇస్తామంటే ఎల్పీ ఆఫీస్‌లో తమ సభ్యులు మార్చుకొని వచ్చేవారని చెప్పారు. కానీ, మహిళా కానిస్టేబుళ్లను ముందు పెట్టి బట్టలు మార్చుకోండి? అంటే ఎలా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దళితుల ఆత్మగౌరవం అంటున్నారని, మరి మహిళలకు ఆత్మగౌరవం లేదా? అని ప్రశ్నించారు. తమపై ఏమీ జరుగకపోతే సభలో తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
మాట్లాడుతామంటే డ్రామా అంటున్నరు?
రెండు రోజులుగా స్పీకర్ తల్లి గురించి మాట్లాడారని, కానీ, దాడికి గురైన అక్కల(మహిళా ఎమ్మెల్యేలు) గురించి మాత్రం పట్టించుకోవడం లేదని సబిత, సునీత, కోవ లక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. తాము మాట్లాడేందుకు ప్రయత్నిస్తే దానిని కూడా డ్రామాగా చిత్రీకరిస్తున్నారని, ఇది మరింత బాధ కలిగించిందని చెప్పారు. తమకు కనీసం మాట్లాడే అవకాశం అయినా ఇవ్వాల్సిందని పేరొన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేస్తుండగా.. చీఫ్ మార్షల్ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కనీసం ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడనివ్వరా? అంటూ వారు ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులుగా తమకు ఉన్న హకులను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నదని, తమ వాదనను ప్రజలకు చెప్పుకొనే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు.
స్పీకర్‌ను ఏమీ అనలేదని ఎమ్మెల్సీల వివరణ
స్పీకర్‌పై ఎమ్మెల్సీలు ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, తమ ఎమ్మెల్సీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని మహి ళా ఎమ్మెల్యేలు తెలిపారు. తమ ఎమ్మెల్సీలు క్షమాపణ కోరారని, ఆ తర్వాత వారినే సస్పెం డ్ చేశారని ఆరోపించారు. హాల్లో, స్పీకర్ వద్ద తమ వాదనను వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ చావాలని కోరుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మహిళా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఒకవైపు స్పీకర్‌ను అవమానించారనే ఆరోపణలతో తమ పార్టీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారని, మరోవైపు కేసీఆర్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.