హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి పాలన నియంతృత్వాన్ని తలపిస్తున్నదని బీఆర్ఎస్ మహిళా, మాజీ మహిళా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్, గుజరాత్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మహిళలకు అన్యాయం జరిగిందని రెక్కలు కట్టుకొని వాలిపోయే రాహుల్‌గాంధీ.. లగచర్లకు ఎందుకు రారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్కు పేగుబంధం ఉందని, అందుకే ఏ వర్గం ఆపదలో ఉన్నా పరుగెత్తుకెళ్లటం తమ బాధ్యత అని స్పష్టంచేశారు. ప్రభుత్వ దమనకాండను, అవినీతి అక్రమాలను నిత్యం ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు సహా ఇతర నాయకులను అరెస్టు చేస్తాం, జైళ్లో పెడ్తామంటే ఉద్యమాలు ఆగిపోవనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తించాలని సూచించారు. శనివారం తెలంగాణ భవన్లో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మీడియాతో మాట్లాడారు. లగచర్లలో మహిళలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా తుల ఉమ.. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యుల కోసమే ఫార్మా సిటీ పేరుతో లగచర్ల తదితర ప్రాంతాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. గిరిజనుల భూమిని గుంజుకోవటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఉన్న భూమిపోతే తమ బతుకేంటని ప్రశ్నించినందుకు చిత్రహింసలు గురిచేయటం ఏంటి? అని ప్రశ్నించారు. తన జీవితంలో ఏనాడూ ‘జై తెలంగాణ’ అనని రేవంత్‌రెడ్డికి ప్రజల కష్టసుఖాలు ఏమి తెలుసని పేర్కొన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే మహిళల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఏంటని నిలదీశారు. తనపై దాడి జరుగలేదని స్వయంగా కలెక్టరే చెప్తుంటే, దాడి జరిగిందని, అందుకు కేటీఆరే కారణమని పేర్కొనటం దుర్మార్గమన్నారు. లగచర్ల ఉదంతంపై రాహుల్‌గాంధీతోపాటు మేధావులు, ప్రజాసంఘాలు స్పందించాలని డిమాండ్ చేశారు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటామని చెప్పే ఎర్రజెండా పార్టీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
పేదల జీవితాలను మట్టుపెట్టడమే ప్రజాపాలనా? అని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రశ్నించారు. అమాయక గిరిజనుల జీవితాలతో చెలగాటమాడితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సీఎం నియోజకవర్గంలోనే ఇంత దుర్మార్గం జరుగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రజల సమ్మతితో భూసేకరణ జరుగాలే తప్ప, బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అర్ధరాత్రి ఆడపిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు కర్కషంగా వ్యవహరించిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఫార్మా కంపెనీ పేరుతో కొడంగల్‌లో జరుగుతున్న దారుణాన్ని ప్రతీ ఒక్కరూ ప్రశ్నించాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ సూచించారు. లగచర్ల బాధితుల కష్టాలు పగవారికి కూడా రాకూడదని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కడుపు తరుక్కుపోయిందని, వారి ఆవేదన వర్ణణాతీతమని పేర్కొన్నారు. గిరిజనులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేదలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని.. కేసులు, అరెస్టులకు బీఆర్ఎస్ భయపడదని తేల్చిచెప్పారు.
ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్లకు వెళ్లగా అక్కడ రైతులు ఎదురు తిరిగిన ఘటన జరిగి వారం రోజులైనా ఇంకా కోలుకోలేదు. ప్రశాంతమైన పల్లెలు, పచ్చని పొలాలున్న లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లోని ప్రజల్లో ఇంకా భయం వీడటం లేదు. పోలీసులు ఎప్పుడు వస్తారో ఎవరినీ తీసుకెళ్తారో అనే భయంతో స్థానికులు బతుకుతున్నారు. గ్రామాలను వదిలి వెళ్లిన రైతులు, యువకులు ఇంకా తిరిగి ఇండ్లకు రాకపోవడంతో తండాలు నిర్మానుష్యంగా మారాయి.