Harish Rao | హైదరాబాద్, జూలై 1 (నమస్తేతెలంగాణ): ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర లేపింది బీఆర్ఎస్ పార్టీయేనని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతులు తిరస్కరించేదాకా అలుపెరగని పోరాటం చేశామని గుర్తుచేశారు. మంగళవారం ప్రజాభవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ మాట్లాడిన మాటలపై హరీశ్ ఘాటుగా స్పందించారు. గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు చాలంటూ చెప్పిన సీఎం రేవంత్‌కు మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేశామని తెలిపారు. పీపీటీలోనూ సీఎం పాత అబద్ధాలను పదేపదే వల్లెవేశారని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్‌కు డిమాండ్ చేయకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.
‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నువ్వు చూపుతున్న గురుభక్తికి ఇది నిదర్శనం కాదా? గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ అనుమతుల్లేకుండా ఈఏసీ పర్మిషన్ ఇవ్వదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి వెళ్లడానికి ముందే అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లాలనే సోయి కాంగ్రెస్‌కు లేకపోవడం.. కనీస అవగాహన లేని వ్యక్తులు ముఖ్యమంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం తెలంగాణకు పట్టిన దౌర్భాగ్యం’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ పాలనలో ప్రస్తావనే లేని బనకచర్ల..ఇప్పుడు ఎవరి అండతో తెరపైకి వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? నువ్వు మౌనం వహిస్తూ అందిస్తున్న సహకారంతోనే ఇక్కడి దాకా వచ్చింది వాస్తవం కాదా రేవంత్‌రెడ్డీ?’ అని నిలదీశారు. ‘తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తూ, లెక్కకు మించి అబద్ధాలు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్పై చేస్తున్న క్షుద్ర రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. నీ చర్యలు, అవలంబిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలను అసహించుకుంటుదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని హరీశ్‌రావు సూచించారు.