బుల్డోజర్ కన్నా కారే కావాలంటున్నరు జూబ్లీహిల్స్ ఓటర్లు. రెండేండ్ల కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలన కన్నా పదేండ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనకే తమ ఓటు అని తేల్చి చెప్తున్నరు. అందుకే కేకే నుంచి చాణక్య దాకా.. కోడ్మో నుంచి ఓటా వరకు సర్వేలన్నింటా కారు జోరే కనిపిస్తున్నది. గల్లీ గల్లీలో గులాబీ గాలి వీస్తున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కేసీఆర్ (KCR) పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఓటరు మహాశయుడు మరిచిపోలేదు. రెండేండ్ల కాంగ్రెస్ (Congress) పాలనలో జరిగిన దురాగాతాలను కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఇక, సమయం వచ్చింది. రేవంత్ (Revanth Reddy)బుల్డోజర్ పాలనకు తమ సిరా చుక్కతో బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఓటరు సమాయత్తమయ్యాడు. మరో ఐదు రోజుల్లో జరుగనున్న ఉప ఎన్నికలో చెయ్యి పార్టీకి చెయ్యివ్వాలని నిర్ణయించుకొన్నాడు. దీన్ని ధ్రువపరుస్తూ.. గడిచిన 45 రోజులుగా జరిగిన ప్రతీ సర్వేలోనూ బీఆర్ఎస్ పార్టీకే ఓటరన్న పట్టంగట్టాడు. కేసీఆర్ పాలనలోనే మంచిగ ఉందని తేల్చిచెప్పాడు. ఎన్నికల సర్వేలకు విశ్వసనీయ సంస్థలుగా పేరున్న ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’, ‘కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ’, ‘చాణక్య స్ట్రాటజీస్’, ‘బిలియన్ కనెక్ట్’, ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థకు చెందిన ‘ఐఐటీయన్ల టీమ్’, ‘ఆర్ఆర్ పొలిటికల్’ సర్వే, తాజాగా ‘ఓటా మీడియా హౌస్’, ‘పీపుల్స్ ఇన్సైట్’ నిర్వహించిన సర్వేల్లోనూ తమ ఓటు గులాబీ పార్టీకేనని కుండబద్దలు కొట్టాడు. మొత్తంగా రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కారు జెట్స్పీడ్తో దూసుకుపోయి విజయపతాకాన్ని ఎగురవేయడం దాదాపుగా ఖాయమైంది. విచిత్రమేమిటంటే కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లోనూ.. హస్తం పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీనే ముందంజలో ఉన్నట్టు తేలడం గమనార్హం.
అన్ని సర్వేలదీ ఒకే మాట
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా పిలిచే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తి రేకెత్తిస్తున్నది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఇటీవల కాలంలో పలు ప్రముఖ సర్వే సంస్థలు ఓటర్ల మనోగతాన్ని వెలువరించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజానాడి ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి సెప్టెంబర్‌లో ‘కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ’ అనే సంస్థ టెలిఫోనిక్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 42.8 శాతం మంది బీఆర్ఎస్కే తమ ఓటు అని ప్రకటించారు. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని 46 శాతం మంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇక మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఆ వర్గం ఓటర్లు ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారో తెలుసుకోవడానికి గత నెల 10 నుంచి 21 వరకు 82మంది సభ్యుల బృం దంతో ‘బిలియన్ కనెక్ట్’ అనే సంస్థ మైనార్టీల అభిప్రాయాలపై ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 50.5 శాతం మంది మైనార్టీలు బీఆర్ఎస్కే మద్దతు ప్రకటించడం విశేషం. సెప్టెంబర్ నెల మూడో వారంలో కాంగ్రెస్ కూ డా అంతర్గత సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో నూ బీఆర్ఎస్ పార్టీనే ముందంజ లో ఉన్నట్టు స్పష్టమైంది. ఈ సర్వేలో కాంగ్రెస్ కంటే 3 శాతం ఓట్లతో కారు దూసుకుపోతున్నది.
కేసీఆర్ పార్టీకే జేజేలు
‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ అనే సంస్థ జూబ్లీహిల్స్‌లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 30 వరకు విస్తృతస్థాయిలో సర్వే నిర్వహించింది. అన్నివర్గాల మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్కే మద్దతు పలికినట్టు ఈ సర్వే సంస్థ పేర్కొన్నది. ఈ ఉప ఎన్నికలో గెలువడానికి బీఆర్ఎస్కు 100 శాతం స్కోప్ ఉందన్న కేకే సర్వేస్ సీఈవో కిరణ్ కొండేటి.. కేసీఆర్ పార్టీని ఢీకొట్టి గెలువడం కాంగ్రెస్‌కు అసాధ్యమని నిగ్గుతేల్చా రు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు 55.2 శాతం మంది ఓటర్లు జై కొట్ట గా, కాంగ్రెస్‌కు 37.8 శాతం మంది ఓటర్లు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. బీజేపీ వైపునకు 7 శాతం మంది ఉన్నట్టు పేర్కొన్నారు.
బీ ఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఏకంగా 17.4 శాతం ఓటింగ్ తేడా ఉన్నదని తేల్చిచెప్పారు. ఇక చా ణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రీ పోల్ సర్వేలో బీఆర్ఎస్కు 43 శాతం మంది జూబ్లీహిల్స్ ఓటర్లు మద్దతు ప్రకటించినట్టు తేలింది. కాంగ్రెస్‌కు 38 శాతం మంది, బీజేపీకి 10 శాతం మంది ఓట్లు వేయవచ్చని సర్వే సంస్థ అభిప్రాయపడింది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి 5 శాతం ఓట్లు ఎక్కువగా పోల్ అయ్యే అవకాశం ఉన్నట్టు సర్వే పేర్కొన్నది. ఇక సర్వేలో పాల్గొన్న 9 శాతం మంది స్వింగ్ ఓటర్లుగా పేర్కొన్న సంస్థ.. ఈ స్వింగ్ ఓటర్లలో మె జార్టీ మంది బీఆర్ఎస్కే మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడిం ది. స్వింగ్ ఓ టర్లు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు ఉండటమే దీనికి కా రణంగా వివరించింది. అంటే ఈ లెక్కన బీఆర్ఎస్కు మరో 4 శాతం ఓట్లు అదనంగా వచ్చే అవకాశం ఉన్నట్టు సంస్థ అంచనా వేసింది.
జెట్ స్పీడ్‌లో కారు
హైదరాబాద్‌లోని ఎస్ఏఎస్ గ్రూప్‌నకు చెందిన ఐఐటీయన్ల బృందం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. బీఆర్ఎస్కే తమ ఓటు వేయనున్నట్టు సర్వేలో పాల్గొన్న 46.5 శాతం మంది తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌కు 42.5 శాతం మంది మద్దతు ప్రకటించగా, బీజేపీకి 8.25 శాతం ఓట్లు వచ్చే అవకాశమున్నట్టు సర్వే పేర్కొన్నది. ఇతరులకు 2.75శాతం మంది ఓటు వేయవచ్చని అంచ నా వేసింది. మొత్తంగా కాంగ్రెస్ కంటే 4 శా తం ఎక్కువ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుపు ఖా యమని సర్వే సంస్థ కుండబద్దలు కొట్టింది. తాజాగా ఓటా మీడియా హౌస్ విడుదల చేసిన సర్వేలోనూ కారు దూసుకుపోయినట్టు తేలింది. జూబ్లీహిల్స్ ఓటర్లలో 48 శాతం మంది కేసీఆర్ పార్టీకి మద్దతు ప్రకటించగా.. కాంగ్రెస్‌కు 42శాతం, బీజేపీకి 9శాతం మంది ఓటేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురనున్నట్టు ‘పీపుల్స్ ఇన్సైట్’ నిర్వహించిన సర్వే తేల్చింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 44.03%, కాంగ్రెస్‌కు 39.44%, బీజేపీకి 13.94% ఓటు షేర్ కానున్నట్టు వెల్లడించింది. ఇలా.. పలు సర్వేల్లో కారు పార్టీ జెట్స్పీడ్తో దూసుకుపోతున్నట్టు తేలింది.
కేసీఆరే కావాలంటూ..
‘మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ది పీపుల్’ పేరిట ఆర్ఆర్ పొలిటికల్ సర్వేస్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలోనూ కాంగ్రెస్‌పై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలన్న ప్రశ్నకు.. కేసీఆరే కావాలని ఏకంగా 66.66 శాతం మంది ఓటర్లు ముక్తకంఠంతో తేల్చిచెప్పగా.. రేవంత్‌కు కేవలం 20.03 శాతం మందే మద్దతు ప్రకటించారు. ఇక రేవంత్ పాలనలో పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగుందా?, కేసీఆర్ పాలనలో పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగుందా? అనే ప్రశ్నకు 67.7 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలనే బాగున్నదని మెచ్చుకున్నారు. రేవంత్ పాలన బాగుందని 19.79 శాతం మంది మాత్రమే తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ పార్టీ అమలు చేయగలదన్న ప్రశ్నకు.. బీఆర్ఎస్ పార్టీ అని 65.62 శాతం మంది పేర్కొనగా.. కాంగ్రెస్‌కు 18.75 శాతం మందే మద్దతిచ్చారు.
సర్వేలు చెప్పినట్టే..
జూబ్లీహిల్స్‌లో సర్వేలు నిర్వహించిన ఆయా సంస్థలకు అపారమైన విశ్వసనీయత ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నిరుడు ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి 160 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ అంచనా వేసింది. ఫలితాల్లో దాదాపుగా అవే రిజల్ట్స్ రిపీట్ అయ్యాయి. ఇక, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని కేకే సంస్థ అంచనా వేయగా.. అప్పుడు కూడా అలాగే జరిగింది. కాంగ్రెస్ తరఫున రాజస్థాన్, మహారాష్ట్రలో కోడ్మో సంస్థ గతంలో సర్వే నిర్వహించింది. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మళ్లీ సర్వే చేపట్టింది. కోడ్మో సంస్థ సర్వేల్లో వచ్చిన ఫలితాలే.. ఆయా ఎన్నికల్లో రిపీట్ కావడం విశేషం. ఇక చాణక్య స్ట్రాటజీస్ విడుదల చేసిన పలు సర్వేలు, బిలియన్ కనెక్ట్ మైనార్టీ సర్వేలు, ‘పీపుల్స్ ఇన్సైట్’ సర్వే, ఓటా మీడియా హౌస్ సర్వేలు పలు సందర్భాల్లో నిజమైనట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ అన్నిరకాలుగా ఎంతో కచ్చితత్వంతో ఐఐటీయన్ల పర్యవేక్షణలో చేపట్టిన సర్వేపై పలువురు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
ప్రశ్న: జూబ్లీహిల్స్‌లో గెలిచే పార్టీ ఏది?

