(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రేవంత్ రెండేండ్ల అవినీతిమయ బుల్డోజర్ పాలనతో విసుగెత్తిన జూబ్లీహిల్స్ ఓటరు.. హస్తం పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టనున్నాడా? పోలింగ్‌కు ఇంకా పది రోజులు ఉండగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందా? కేసీఆర్ పదేండ్ల పాలనలో పచ్చగా మారిన తెలంగాణను, విశ్వనగరంగా మారిన హైదరాబాద్‌ను, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో చేసిన సేవలను మరువని జూబ్లీహిల్స్ ఓటర్లు.. రానున్న ఉప ఎన్నికలో బీఆర్ఎస్కే జై కొట్టనున్నారా? ఎన్నికల సర్వేల్లో విశ్వసనీయతకు మారుపేరుగా పేర్కొనే ప్రఖ్యాత సర్వే సంస్థ ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ సీఈవో కిరణ్ కొండేటి శనివారం విడుదల చేసిన సర్వే గణాంకాలను విశ్లేషిస్తే.. ఇది నిజమేనని స్పష్టమవుతున్నది.
సర్వే ఏం తేల్చింది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలు ఖాయమని ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ సంస్థ సీఈవో కిరణ్ కొండేటి కుండబద్దలు కొట్టారు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 30 వరకు 45 రోజులపాటు తాము విస్తృతస్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో జూబ్లీహిల్స్‌లోని అన్నివర్గాల మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్కే మద్దతు పలికినట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో చేపట్టిన ఈ సర్వేలో మెజారిటీ డివిజన్లలో కారు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నట్టు తెలిపారు. ఈ ఉప ఎన్నికలో గెలవడానికి బీఆర్ఎస్కు 100 శాతం అవకాశం ఉన్నదన్న కిరణ్ కొండేటి.. బీఆర్ఎస్ను ఢీకొట్టి గెలువడం కాంగ్రెస్‌కు ముమ్మాటికీ అసాధ్యమని నిగ్గుతేల్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు 55.2 శాతం మంది ఓటర్లు జై కొట్టగా, కాంగ్రెస్‌కు 37.8 శాతమే ఓటర్లు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. బీజేపీ వైపునకు 7 శాతం మంది ఉన్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఏకంగా 17.4 శాతం ఓటింగ్ తేడా ఉన్నదని, ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప మరే పార్టీ జూబ్లీహిల్స్‌లో గెలిచే అవకాశం లేదని తేల్చిచెప్పారు. కాగా జూబ్లీహిల్స్ ఓటర్లు తమకే మద్దతు పలుకుతున్నట్టు నకిలీ సర్వేలతో అసత్యాల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు కేకే తాజా సర్వే చెంపచెల్లుమనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓటుతో ప్రజల సమాధానం
45 రోజులపాటు తాము నిర్వహించిన ఈ సర్వేలో అన్నివర్గాల ప్రజలు పాలుపంచుకొన్నట్టు కిరణ్ కొండేటి తెలిపారు. లక్ష మంది వరకు ముస్లింలు నివసిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ముస్లింలు బీఆర్ఎస్కే తమ మద్దతు ప్రకటించినట్టు పేర్కొన్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మూడుసార్లు గెలవడం, ఉన్నన్ని రోజులూ ప్రజలతో మమేకం కావడం బీఆర్ఎస్కు కలిసొచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థితో పోలిస్తే, ఒక నెల ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడం కూడా కారు స్పీడ్‌కు కారణమని విశ్లేషించారు. ఇక, రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై ఓటుతో సమాధానం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లు నిర్ణయించుకొన్నట్టు పేర్కొన్నారు. ఎవరివో బెదిరింపులు, మరెవరివో బుజ్జగింపులను చూసి తాము ఈ సర్వే ఫలితాలు వెల్లడించడం లేదని, ప్రజల మనసులో ఏమున్నదో అదే బయటపెట్టామని కిరణ్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
అక్కడ చెయ్యి కంటే కారుకు డబుల్ మద్దతు
జూబ్లీహిల్స్‌లో కీలకమైన బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ గరిష్ఠంగా 31.6 శాతం మార్జిన్‌తో దూసుకుపోతున్నట్టు కేకే సర్వే సంస్థ పేర్కొంది. కేకే సర్వే గణాంకాల ప్రకారం.. బోరబండ డివిజన్లో బీఆర్ఎస్కు 63.2 శాతం మంది జై కొట్టగా, కాంగ్రెస్‌కు 31.6 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఇక్కడ బీఆర్ఎస్కు లభించిన మద్దతులో కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు సగం మాత్రమే ఉండటం గమనార్హం. ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్కు 61.6 శాతం మంది సంఘీభావం ప్రకటించగా, కాంగ్రెస్‌కు 31.7 శాతం మంది ఓటేశారు. చెయ్యి కంటే కారుకు ఇక్కడ 29.9 శాతం ఎక్కువగా మద్దతు లభించింది.
శ్రీనగర్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్కు 61.9 శాతం మంది ఓటర్లు జైకొట్టగా, 33.3 శాతం ఓట్లకు కాంగ్రెస్ పరిమితమైంది. ఇక్కడ బీఆర్ఎస్ 28.6 శాతం మార్జిన్‌ను నమోదు చేసింది. షేక్‌పేట నియోజకవర్గంలో 60.1 శాతం మంది ప్రజల మద్దతుతో కారు జెట్స్పీడ్తో ఉండగా, 33 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఎంతో వెనుకబడిపోయింది. రెండు పార్టీల మధ్య ఓటింగ్‌లో తేడా 27.1 శాతంగా నమోదైంది. యూసుఫ్‌గూడలో 47.1 శాతం ఓట్లతో బీఆర్ఎస్.. కాంగ్రెస్ కంటే ముందంజలో ఉన్నది. వెంగళ్రావు నగర్ డివిజన్లో 46.1 శాతం మంది, రహమత్‌నగర్ డివిజన్లో 45.6 శాతం మంది బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినట్టు సర్వే సంస్థ వెల్లడించింది.
గులాబీకి పెరుగుతున్న ఆదరణ
కేకే సర్వే సంస్థ అక్టోబర్ 17న వెల్లడించిన సర్వేలో బీఆర్ఎస్ 50.6 శాతం ఓట్లతో ముందంజలో నిలవగా.. 40.8 శాతం ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. తాజా సర్వేలో మాత్రం బీఆర్ఎస్కు 55.2 శాతం మంది ఓటర్లు జై కొట్టినట్టు పేర్కొంది. అంటే రెండువారాల వ్యవధిలోనే బీఆర్ఎస్కు ప్రజామద్దతు దాదాపు 5 శాతం మేర పెరిగినట్టు అర్థమవుతున్నది. రెండువారాల కిందటి కేకే సర్వేలో కాంగ్రెస్‌కు 40.8 శాతం మంది మద్దతు ప్రకటించగా ప్రస్తుతం కాంగ్రెస్‌కు 37.8 శాతం మంది ఓటర్లే మద్దతు ప్రకటించినట్టు సర్వే సంస్థ తెలిపింది. అప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా 9.8 శాతంగా ఉన్నట్టు సర్వే సంస్థ తెలిపింది. గత కేకే సర్వేను ఇప్పటి తాజా సర్వేతో పోల్చి చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా రెండు వారాల్లో 9.8 శాతం నుంచి 17.4 శాతానికి మారి కారుకు విజయావకాశాలు పెరిగినట్టు స్పష్టమవుతున్నది.
ప్రతి సర్వేలోనూ కారుదే జయం
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా పిలుస్తారు. ఇక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచి, హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో 4 లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటీవలి కాలంలో పలు ప్రముఖ సర్వే సంస్థలు ఓటర్ల మనోగతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి. 30 రోజులుగా నిర్వహించిన దాదాపు అన్ని సర్వేల్లోనూ బీఆర్ఎస్కే ఓటర్లు పట్టం కట్టినట్టు తేలింది. ‘కోడ్మో-కనెక్టింగ్ సర్వే’, ‘బిలియన్ కనెక్ట్ మైనార్టీ సర్వే’, ‘చాణక్య స్ట్రాటజీ’ తదితర సంస్థలు ఇటీవల నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ కారుదే విజయమని తేలింది. బయటి సర్వేలే కాదు కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలోనూ హస్తం పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీయే జూబ్లీహిల్స్‌లో దూసుకుపోతున్నట్టు తేలడం గమనార్హం.
పక్కా రిజల్ట్స్‌కు కేరాఫ్.. కేకే
జూబ్లీహిల్స్‌లో తాజాగా సర్వే నిర్వహించిన ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ సంస్థకు అపారమైన విశ్వసనీయత ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నిరుడు ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి 160 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ అంచనా వేసింది. ఫలితాల్లో అవే రిజల్ట్స్ వచ్చాయి. ఇక, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని కేకే సంస్థ అంచనా వేయగా అప్పుడు కూడా అలాగే జరిగింది. దీంతో త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేకే సర్వేస్ అంచనా వేసినట్టే గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రాజకీయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
