రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయిం ది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. వరుసగా మూడోసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉరిశాలగా మారిన సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చి, వేలాది కోట్లతో వస్త్ర పరిశ్రమకు పునరుజ్జీవం పోసి, అనేక సంక్షేమ పథకాలతో నేతన్నకు అడుగడుగునా అండగా నిలిచిన బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే కార్మికక్షేత్రం జైకొట్టింది. 2014, 2020 మున్సిపల్ ఎన్నికల్లో జైకొట్టినట్టే.. భారీ విజయం అందించారు. సిరిసిల్లలోని 39 వార్డులకు 27 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 22 స్థానాలు కట్టబెట్టగా, ఈసారి మరో ఐదు స్థానాలు అదనంగా గెలిపించారు.
కాంగ్రెస్ 6, బీజేపీని 5 స్థానాలకే పరిమితం చేశారు. స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. సిరిసిల్ల బీఆర్ఎస్ కంచుకోట అని మరోసారి నిరూపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ మంత్రులు, పెద్దలు వచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్, బీజేపీని గెలిపించకలేకపోయింది. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంగళ అనిత విజయం సాధించారు.
మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంతో కార్మిక క్షేత్రంలో గులాబీ శ్రేణుల విజయోత్సవాలు అంబరాన్నంటాయి. గెలుపొందిన అభ్యర్థులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయా వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి స్వీట్లు పంపిణీ చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్యాండ్మేళాల మధ్య నృత్యాలు చేసి గులాబీ జెండాలు చేతబూని సందడి చేశారు.