ఆర్మూర్‌టౌన్, జనవరి 21: ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఎదిగిందని అన్నారు. పదేండ్ల పాలనలో అభివృద్ధి పథంలో కొనసాగిన తెలంగాణ కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో వెనుకబడిందని దుయ్యబట్టారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేయాలని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ గడ్డ కేసీఆర్ అడ్డా అని స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన అనేక పథకాలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయని తెలిపారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే షకీల్ మండిపడ్డారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.