Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేరిట కాంగ్రెస్ వెల్లడించిన రిపోర్ట్ ట్రాష్ అనీ.. అబద్ధాలు.. అవాస్తవాలు.. రాజకీయ దురుద్దేశాలే ఉన్నాయని, 60 పేజీలు అసలు నివేదికలోనివేనా? లేక వండి వార్చినవా? తేలాల్సి ఉన్నదని, 665 పేజీల రిపోర్టు పెడితే చీల్చిచెండాడుతామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ‘తమ్మడిహట్టి వద్ద నీటిలభ్యత ఉంటే నాడు తట్టెడు మట్టెందుకు తీయలే?’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. నిపుణుల కమిటీ నిర్ణయం.. సీడబ్ల్యూసీ సూచన మేరకే కాళేశ్వరం మార్పు అని, దానికి అసెంబ్లీ ఆమోదం, క్యాబినెట్, గవర్నర్ అనుమతులూ ఉన్నాయని తేల్చిచెప్పారు. అయినా కమిషన్ నివేదికపై సీఎం, మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ సొంత నిర్ణయమనేది కాంగ్రెస్ దుష్ప్రచారమని, చిత్తశుద్ధి ఉంటే కమిషన్ పూర్తి నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘కాళేశ్వరాన్ని పడావుపెట్టాలె.. బనకచర్లకు నీళ్లు జారగొట్టాలనేది రేవంత్‌రెడ్డి గురుదక్షిణ. అంతిమంగా గెలిచేది న్యాయమే.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేడిగడ్డ పిల్లర్లు బాగు చేయిస్తం.. రైతులకు నీళ్లిస్తం’ అని స్పష్టంచేశారు. కమిషన్ నివేదికలోని అంశాలపై తెలంగాణ భవన్లో హరీశ్ మంగళవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని ఆధారాలతో సహా రిపోర్టులోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ కాంగ్రెస్ కుట్రను ఎండగట్టారు.
పూర్తి నివేదిక బయటపెట్టండి
కమిషన్ పూర్తి రిపోర్టు బయట పెడితే నిజాలను నిగ్గు తేలుస్తామని, వాస్తవాలను ప్రజల ముందు పెడతామని హరీశ్ వెల్లడించారు. కమిషన్ లేని విషయాలను కల్పించి బయటపెట్టిందా? అన్నది తేల్చాల్సి ఉన్నదని చెప్పారు. చరిత్రలో రాజకీయ వేధింపుల కోసం అనేక కమిషన్లు వేశారని, అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదని గుర్తుచేశారు. ఇది కూడా న్యాయస్థానాల్లో నిలబడదని, ప్రజాక్షేత్రంలో నిలబడబోదని కుండబద్దలు కొట్టారు. కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వమే అనుమతులిచ్చిందని, కమిషన్ రిపోర్టు నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని, సీడబ్ల్యూసీని, ఇంజినీర్లను. రిటైర్డ్ ఇంజినీర్లను, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టవుతుందని తెలిపారు. ‘ఒక ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్‌ను రివ్యూ చేయడం బాధ్యత. ఇది రాజకీయ జోక్యం ఎట్లవుతది?’అని నిలదీశారు.
కాంగ్రెస్.. బీజేపీ కుట్ర
రేవంత్‌రెడ్డి పాలనను గాలికి వదిలి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. ‘ఆర్థికశాఖలో బిల్లు పాస్ కావాలంటే 10-12 శాతం కమీషన్లు అని ఎవరినడిగినా చెప్తారు. కాంట్రాక్టర్లే సచివాలయంలో ధర్నాలు చేస్తున్నరు. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమీషన్లు. బిల్డింగ్‌లకు అనుమతులు రావాలంటే కమీషన్లు.. మొత్తం రాష్ర్టాన్ని కమీషన్ల మయం చేసిండ్రు. డబ్బులు దండుకునేందుకు కమీషన్లు.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు రాజకీయ కమిషన్లు.. కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నయి. రెండు పార్టీలు కలిసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నయి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని కాళేశ్వరం కమిషన్ రిపోర్టును బయటపెట్టి రాజకీయ కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతున్నదని, అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారనేందుకు మీడియానే సాక్ష్యమని వివరించారు. ‘కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పూర్తయ్యింది. కేసీఆర్, హరీశ్‌రావును పిలవాల్సిన అవసరం లేదని మీడియాలోనే కథనాలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఏం జరిగిందో తెలియదు. రేవంత్‌రెడ్డి వెళ్లి దండంపెట్టిండో ఏమో తెలియదు.. రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు. రాత్రికి రాత్రే లీకులు. హరీశ్‌ను, కేసీఆర్‌ను కమిషన్ పిలిచింది అన్న వార్తలు. మాకు నోటీసులైతే రాలేదు. కానీ మీడియాకు మాత్రం లీకులు. ఇదంతా ఒక కుట్రప్రకారం జరుగుతున్నది’ అని వివరించారు.
బనకచర్లకు నీళ్లు జారగొట్టేందుకే
‘రేవంత్‌రెడ్డీ.. మీ గవర్నమెంట్ వచ్చి రెండేండ్లయ్యింది. ఒక్క చెరువు తవ్వినవా? ఒక్క చెక్‌డ్యామ్ కట్టినవా? ఒక్క కాల్వ తవ్వినవా? ఒక్క ఎకరానికన్నా నీళ్లిచ్చినవా? ఈ రెండేండ్లలో ఏదైనా చేసినవా? అంటే ఢిల్లీకి కమీషన్ల మూ టలు తీస్కపోయినవ్. ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసినవు. ఎలక్ట్రిసిటీ కమిషన్, కాళేశ్వరం కమిషన్.. అంతకుమించి నువ్వు చేసిందేం లేదు. వచ్చే రెండేండ్లల్లోనూ చేసేదేం లేదు. వీటి మీదనే సినిమా.. సీరియళ్లు నడుపుతరు తప్ప ఇంకేం లేదు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలిపోయినయి. రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పింది. 7వ బ్లాక్‌ను మళ్లీ కట్టండి.. వాడండి అని చెప్పింది. కానీ నువ్వు కట్టవు. ఇక్కడ నీళ్లు వదిలెయ్యాలె.. బనకచర్లకు జారగొట్టాలె. నీ గురువుకు గురుదక్షిణ చెల్లించాలె. ఇంతకు మంచి మరేం లేదు’ అని ధ్వజమెత్తారు.
ప్రత్యామ్నాయం కోసం సీడబ్ల్యూసీయే చెప్పింది
కమిషన్ రిపోర్టులో ప్రాజెక్టును తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం నిజాయితీ (హానెస్ట్)గా లేదని, విశ్రాంత ఇంజినీర్లు (నిపుణుల కమిటీ) మేడిగడ్డను వద్దన్నారని, క్యాబినెట్ ఆమోదమే లేదనడం అబద్ధమని హరీశ్ ఖండించారు. ‘తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం మా నిర్ణయం కాదు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చెప్పింది. 2015 ఫిబ్రవరి 2న ఒక లేఖ, మార్చిలో మరో లేఖను కేంద్రం రాష్ర్టానికి రాసింది. హైడ్రాలజీ నిపుణలు చెప్పిన లెక్కల ప్రకారం.. ప్రతిపాదిత ప్రాజెక్టు అవసరాలకు నికర జలాలు లేవని, కాబట్టి ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సీడబ్ల్యూసీ ఆ లేఖల్లో సూచించింది. ఒక నదిలో 100 టీఎంసీల నీళ్ల ప్రవాహం ఉన్నదంటే 75 టీసీఎంలను మాత్రమే నిఫుణులు ప్రమాణికంగా తీసుకుంటారు. తమ్మిడిహట్టి దగ్గర చెప్పిన 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉన్నది. ఇందులో ఎగువ రాష్ర్టాలకు చెందిన 63 టీఎంసీలు వారు తీసుకుంటే.. 102 టీఎంసీలే ఉంటాయని తెలిపారు.
ఎగువ రాష్ర్టాలు కేటాయించిన దానికన్నా ఎక్కువగా వాడుతున్నందున 102 టీఎంసీలు కూడా ఉండే అవకాశం లేదని లేఖలో పేర్కొన్నారు. తమ్మిడిహట్టి వద్ద సరిపడా నీళ్లు లేనందున సమీక్షించుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని రెండు లేఖల్లో సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఉమాభారతి లేఖ రాశారు. హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ, ఉమాభారతి లేఖలో ప్రతిపాదిత ప్రాంతంలో సరిపడా నీళ్లు లేవని పేజీ నంబర్ మూడులో క్లియర్‌గా చెప్పారు. 160 టీఎంసీల నీళ్లు అక్కడ అందుబాటులో లేవు. మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలని సూచించింది. రెండు సీడబ్ల్యూసీ లేఖలతోపాటు కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ కూడా అక్కడ నీళ్లు లేవన్న విషయాన్ని వెల్లడించాయి. కానీ, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పేరుతో కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రాజెక్టును మార్చడం నిజాయితీగా లేదని అంటున్నారు. ప్రాణహిత- చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్టు కాంగ్రెస్ చెప్తున్నది. కానీ, నీటి లభ్యత లేదని ఉమాభారతి అదే లేఖలోని మరో పేరాలో పేరొన్నారు’ అని హరీశ్ వెల్లడించారు.
మహారాష్ట్ర స్పష్టంగా చెప్పింది..
‘మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించవద్దని స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ ఏడేండ్లు అధికారంలో ఉన్నప్పుడు అదే చెప్పారు. ఒక సంవత్సరం కేసీఆర్, నేను, అధికారులు వెళ్లినా ఒప్పుకొనే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్న చోట ఎవరైనా ప్రాజెక్టు కడుతరా? సుప్రీంకోర్టు నుంచి అనుమతి పదేండ్లయినా రాదు. ఇది నీళ్లు ఇచ్చే ఉద్దేశం కాదు. నీళ్లు లేని చోట ఇరికించిండ్రు, అంతర్రాష్ట్ర ఒప్పందాల కిరికిరిలో ఇరికించిండ్రు. చాప్రాల్ వైల్డ్లైఫ్లో ఇరికించిండ్రు. తమ్మిడిహట్టిని ప్రతిపాదించి పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్. అసలు ఇవాళ చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ మీదనే తీసుకోవాలి. ఏ ప్రాతిపదికన అక్కడ ప్రాజెక్టును పెట్టిండ్రు? ఏడేండ్లలో ఎందుకు అనుమతులు తేలేదు? ఇవాళ మీరే సమాధానం చెప్పాలి. ఉల్టా మమ్మల్ని అంటున్నరు’ అని నిప్పులు చెరిగారు.
సీడబ్ల్యూసీ ఎందుకు ఒప్పుకొన్నది?
‘ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే సీడబ్ల్యూసీ ఎందుకు ఒప్పుకొన్నది? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యం లేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపినం. అన్ని అంశాలు డీపీఆర్‌లో ఉన్నయి. ఆ డీపీఆర్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని చేసిన సూచన మేరకు ప్రాజెక్టు లొకేషన్‌ను మేడిగడ్డకు మార్చినట్టు డీపీఆర్‌లో ఉన్నది. అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకెళ్తామని స్పష్టంగా పేర్కొన్నం. ఇందులో రహస్యం ఏమున్నది? మా సిన్సియారిటీ లోపం ఎక్కడున్నది?’ అని హరీశ్ ప్రశ్నించారు. కాళేశ్వరం డీపీఆర్‌లో అన్ని అంశాలను స్పష్టంగా పేర్కొని కేంద్రానికి పంపడంతోనే ఏడాదిలోనే 11 రకాల అనుమతులు వచ్చాయని తేదీలతో సహా వివరించారు. ‘దేశంలో ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని అనుమతులు తీసుకోవాలో అన్నీ కాళేశ్వరం కోసం కేంద్రం నుంచి, సీడబ్ల్యూసీ నుంచి తీసుకున్నం. బీఆర్ఎస్ ప్రభుత్వం సిన్సియర్‌గా లేకపోతే ఇన్ని అనుమతులను కేంద్రం ఎలా ఇస్తది? కాళేశ్వరం కమిషన్ ఎవరిని తప్పు పడుతున్నది? కేంద్ర ప్రభుత్వాన్నా? సెంట్రల్ వాటర్ కమిషన్నా? బ్యూరోక్రాట్లనా? రాజకీయ దురుద్దేశంతో తప్పుపట్టుకుంటే పోతే రాష్ట్ర పరువు ఏంగావాలె?’ అని హరీశ్ నిలదీశారు.
నిపుణుల కమిటీ సూచనల మేరకే..
‘మేడిగడ్డ వద్ద బరాజ్ కట్టవచ్చు.. కానీ 160 టీఎంసీలు నేరుగా మిడ్ మానేరుకు తీసుకుపోవచ్చా?అనే అంశాన్ని పరిశీలించాలని రిటైర్ట్ ఇంజినీర్లు చెప్పిండ్రు. మేడిగడ్డ దగ్గర బరాజ్ కట్టవచ్చు అనే విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సింగరేణి, కోల్‌బెల్ట్ ఉన్నందున గ్రావిటీ కెనాల్ ద్వారా నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదని వివరించారు. రిటైర్డ్ ఇంజినీర్లతో కూడిన నిపుణుల కమిటీ ఇదే విషయాన్ని ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ రూపంలో నివేదించింది. ఎక్స్‌ఫర్ట్ కమిటీ నివేదికను తాను అడిగితే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ సంతకంతో కూడిన రిపోర్ట్‌ను 2025, జూన్ 6న నాకు అందించారు’ అని గుర్తుచేశారు. 7-4-2025 నాడు నిపుణుల కమిటీ ఫస్ట్ రిపోర్టులో తమ్మిడిహట్టి వద్ద 102 టీఎంసీల నీళ్లు అందుబాటులో లేవనే విషయం సీడబ్ల్యూసీకి చెప్పిందన్న అంశాలను అంకెలు, లెక్కలు, తేదీలు, ఆధారాలతో సోదాహరణంగా వివరించారు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తరలించడం సాధ్యం కాదని ఎక్స్‌ఫర్ట్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకొని శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా గోదావరి నదీ మార్గంలోనే నీళ్లు తరలించాలని నిర్ణయించిన విషయాన్ని వెల్లడించారు.
వ్యాప్కోస్ కన్సల్టెన్సీ ద్వారా లైడార్ సర్వేచేసిన తర్వాత ఎక్స్‌ఫర్ట్ కమిటీ సూచనల మేరకు మూడు బరాజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లాలని నిర్ణయించారని స్పష్టంగా చెప్పారని తెలిపారు. గత సర్కారు ఎక్స్‌ఫర్ట్ కమిటీ రిపోర్టును తొక్కిపెట్టామని, పట్టించుకోలేదని మొన్న మంత్రులు 20 పేజీల్లోని అంశాలను పదే పదే అవాస్తవాలు చెప్పారని దుయ్యబట్టారు. వ్యాప్కోస్ అనే కన్సల్టెన్సీ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు నిర్మించాలని సూచించిందని స్పష్టంచేశారు. నిపుణుల కమిటీ బాధ్యులే అంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తే, మేం పట్టించుకోలేదని, తొక్కిపెట్టామని ప్రభుత్వం చెప్పిన విషయం అసత్యమని ఆక్షేపించారు. ఈ విషయం కమిషన్ రిపోర్టులో ఉన్నదా? లేదా? అనే విషయం తెలియదని, పూర్తి నివేదిక బయటకు వస్తేనే నిజనిజాలు నిగ్గుతేలుతాయని చెప్పారు. రిపోర్టులో ఏమున్నదోగాని కాంగ్రెస్సోళ్ల గోబెల్స్, అబద్ధాల పరంపర కొనసాగిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నదని దుయ్యబట్టారు. నిజంగానే కమిషన్ కూడా ఎక్స్‌ఫర్ట్ కమిటీ రిపోర్టును తొక్కిపెట్టి కాళేశ్వరం నిర్మించారని నివేదిస్తే ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్‌గా పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. నిజంగానే కమిషన్ నిపుణుల కమిటీని రిపోర్ట్‌ను పరిగణలోకి తీసుకోకుంటే అది అంతా ట్రాష్, ఫేక్, ఇల్లాజిక్ రిపోర్ట్ అనే విషయం తెలిసిపోతుందని చెప్పారు. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను తనకు ఘోష్ కమిషన్ అందించిందని, ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలని ప్రశ్నించారు.
అసెంబ్లీలో కడిగేస్తం
ఘోష్ కమిషన్ రిపోర్ట్, క్యాబినెట్ సమావేశం తర్వాత తయారైన నివేదికపై అసెంబ్లీలో ప్రభుత్వానికి దీటుగా సమాధానమిస్తామని హరీశ్ తెలిపారు. ‘అధికారపక్షాన్ని కడిగేస్తం.. దమ్ముంటే మైక్ కట్ చేయవద్దు’ అని సూచించారు. మైక్ కట్ చేసి పారిపోవడం రేవంత్ ప్రభుత్వానికి అలవాటేనని ఎద్దేవా చేశారు. ‘మాట్లాడే సమయమిస్తే అన్ని నిజాలు చెప్తం..మరిన్ని ఆధారాలు బయట పెడుతం’ అని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయమంటూ ముఖ్యమంత్రి, మంత్రులు తెలివితక్కువ మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సమీక్షించడం ముఖ్యమంత్రి బాధ్యత..రాష్ట్రంపై ఈ ప్రాంత ప్రజలపై ప్రేమ ఉన్న వారెవరైనా అదే చేస్తరు..వాస్తవానికి సమీక్ష చేయకపోవడం తప్పు..కానీ చేస్తే తప్పా? ఇట్ల మాట్లాడటం ఏం పద్ధతి? రివ్యూ చేస్తే రాజకీయ ప్రమేయమని చెప్పడం అసంబద్ధం.. అర్థరహితం’ అని ఆక్షేపించారు. ‘నిజంగా రాష్ట్రం మీద ప్రేమున్న వ్యక్తి.. ఉద్యమించి, ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించిన వ్యక్తి..తెలంగాణ ప్రజలకు నీళ్లివ్వాలని తపనపడ్డ వ్యక్తి కేసీఆర్.. రాత్రింబవళ్లు కష్టపడ్డరు.. తండ్లాడిన్రు.. తొందరగా పూర్తి చేసి నీళ్లందించాలని ఆరాటపడ్డరు’అని పునరుద్ఘాటించారు.
క్యాబినెట్లో నిర్ణయించి వ్యాప్కోస్‌కు అప్పగించినం
నిపుణుల కమిటీ, వ్యాప్కోస్ సూచనలు, హైపర్ కమిటీ, సీడబ్ల్యూసీ నివేదికల ఆధారంగానే అప్పటి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని హరీశ్ కుండబద్దలు కొట్టారు. కానీ కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయమని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2016, జూన్ 3న కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అనుమతులు తీసుకొని తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయం చూపే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌కు అప్పగించామని గుర్తుచేశారు. ప్రాణహిత ఏడు లింక్‌లను అదే సంస్థకు ఇచ్చారని, ఒకే లింక్ మార్చాల్సి రావడంతో తాము కూడా వ్యాప్కోస్‌కే అప్పగించామని వెల్లడించారు. క్యాబ్‌నెట్ సబ్ కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకొని క్యాబినెట్లో ఆమోదించి కాళేశ్వరం నిర్మించాలని నిర్ణయించామని స్పష్టంచేశారు. గతంలో ప్రాణహిత ప్రాజెక్టు సర్వే బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం అదే సంస్థకు అప్పగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఏ అనుమతులూ లేకుండా, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోకుండా, వైల్డ్‌లైఫ్ పరిధిలోకి వస్తుందా? రాదా?అనే విషయాన్ని చూడకుండా అప్పటి కాంగ్రెస్ సర్కారు తమ్మిడిహట్టి వద్ద ప్రాణిహిత ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించిందని తూర్పారబట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణానికి 2018, మే 27న, 2021, ఆగస్టు 1న క్యాబినెట్ ఆమోదం తీసుకున్నామని గుర్తుచేశారు. అదనపు పనులకు కూడా మంత్రివర్గ ఆమోదం ఉన్నదని చెప్పారు. కానీ మొన్న సీఎం, మంత్రులు అనుమతులు లేవని అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని వాపోయారు. అన్నారం బరాజ్‌కు 2022, ఆగస్టు 11న క్యాబినెట్లో తుది అనుమతులు తీసుకున్నామని స్పష్టంచేశారు.
అసెంబ్లీకి నాటి సీఎం కేసీఆర్ ప్రజెంటేషన్
‘నాడు కేసీఆర్ ఎంతో ఫెయిర్‌గా ఉన్నారు. నాడు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను శాసనసభకు కేసీఆర్ వివరించారు. మన దేశంలోనే ఇది తొలిసారి. ఇదొక చరిత్ర. ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు, శాసనసభకు వివరించిన ముఖ్యమంత్రి ఓన్లీ కేసీఆర్’ అని హరీశ్ గుర్తుచేశారు. 2016, మార్చి 31న ప్రాజెక్టుల గురించి కేసీఆర్ ప్రొజెక్టర్‌లో చెప్తూ ‘ఇది మేడిగడ్డ రిజర్వాయర్. అక్కడి నుంచి ఇక్కడిదాకా లైవ్ వస్తుంది. ఈ మార్గంగా మనం సుందిళ్ల, అన్నారం బరాజ్‌లోకి నీళ్లు తీసుకుంటం. సుందిళ్ల బరాజ్ దగ్గర నీళ్లు ఉంటయి. (ప్రొజెక్టర్‌లో పై ప్రాంతాన్ని చూపిస్తూ) దీని నుంచి దీన్లో నీళ్లు పోస్తే, ఎల్లంపల్లి దాకా మనకు నీళ్లుంటయి. ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టనది కాబట్టి, ఈ సంవత్సరం తక్కువ నీళ్లు నింపారు. వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో నిండుతుంది’ అని కేసీఆర్ చెప్పిన మాటలను హరీశ్‌రావు పీపీటీలో వివరించారు. నాటి వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో గూగుల్‌లో ఉన్నాయని చెప్పారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకే అసెంబ్లీలో వివరిస్తే.. ఆయన ఎలా సోలో డెసిషన్ తీసుకున్నారని అంటారు? అని ప్రశ్నించారు. ఆ రోజు కాంగ్రెస్‌కు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రిపేర్ కాలేదని వెళ్లిపోతే మిగతాపార్టీలు, ఎమ్మెల్యేలు తమ సలహాలు సూచనలు ఇచ్చారని చెప్పారు.
అసెంబ్లీ ఆమోదం కూడా ఉన్నది
కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అప్రూవల్స్ మాత్రమే కాకుండా అసెంబ్లీ అనుమతులు కూడా ఉన్నాయని హరీశ్ చెప్పారు. వాటిన్నింటికంటే అసెంబ్లీ అనుమతులు చాలా పవర్ఫుల్ అని తెలిపారు. 2016, మార్చి 10న అప్పటి గవర్నర్ నర్సింహన్ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారని, ఆ ప్రసంగాన్ని క్యాబినెట్ తయారు చేసి ఆమోదించిందని చెప్పారు. ఆ ప్రసంగాన్ని గవర్నర్ కూడా ఆమోదిస్తేనే కదా ఆయన అసెంబ్లీలో చదివారని గుర్తుచేశారు. ప్రాజెక్టులను సరళీకృతం చేయడానికి కీలకమైన సమీక్షలు చేసి, అవసరమైన అనుమతులు ఇచ్చారని నాటి గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారని, నాటి ఫైనాన్స్ ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా గవర్నర్ దగ్గరకు వెళ్లిందని, నాటి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్‌లో కూడా స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.
ప్రజలకు ఉన్న అవసరాల ప్రకారం ప్రాజెక్టులను సరళీకృతం చేయడానికి ప్రాజెక్టులన్నింటినీ సమీక్షించి, అవసరమైన చోట తిరిగి రీడిజైన్ చేయడమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, భక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు రీ-ఇంజినీరింగ్ చేసిన ప్రాజెక్టులకు కొన్ని ఉదాహరణలు
– ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్ గురించి 2016, మార్చి 10న గవర్నర్
ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తమ్మిడిహట్టి, పెన్‌గంగపై రాజుపేట, చనాక-కొరట, పెన్ పహాడ్ బరాజ్‌ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం
– 2016, ఏప్రిల్ 16న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని అంశాలు
సత్యహరిశ్చంద్రుడి తమ్ముడిలా ఉత్తమ్
‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బిల్డప్ ఎట్ల ఉన్నదంటే.. సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడు అన్నట్టు ఉన్నది. సత్యహరిశ్చంద్రుడే దిగివచ్చిండా? ఉత్తమ్ నిజాయితీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. 2014లో రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రాణహిత-చేవెళ్ల కోసం కాంగ్రెస్ సర్కారు పెట్టిన ఖర్చు రూ.3,700 కోట్లే. మీరు చేసిన పనులు 10 శాతం. కానీ, నిన్న ఉత్తమ్ రూ.11,000 కోట్లతో 32 శాతం పనులు చేసినమని చెప్పిండు. అబద్ధాలకు కూడా హద్దు ఉండాలె. ఏపీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా.. ఆనాడు క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా, కనీసం తమ్మిడిహట్టికి అనుమతి కూడా తేలేదు. సీడబ్ల్యూసీ అనుమతి తేలేదు. మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు. సిగ్గులేకుండా 32 శాతం పనులు చేసినమంటుండు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కమీషన్లు దొబ్బిండ్రు. రూ.2,300 కోట్లు జేబుల్లో నింపుకొన్నరు. నాలుగేండ్లలో పూర్తిచేస్తామని చెప్పి ఏడేండ్లు అధికారంలో ఉండి తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ’ అని ధ్వజమెత్తారు.
కూలిందన్నది నువ్వే.. కొబ్బరికాయ కొట్టింది నువ్వే!
‘కాళేశ్వరం కూలిందన్న రేవంత్‌రెడ్డే.. గంధమల్లకు కొబ్బరికాయ కొట్టిండు. మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తానని రూ.6000 కోట్ల టెండర్లు ఫైనల్ చేసింది నువ్వే? కాళేశ్వరం కూలిందన్న నువ్వు రూ.6000 కోట్లకు టెండర్లు ఎట్ల పిలుస్తవ్ రేవంత్‌రెడ్డీ? రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే. తెలంగాణ వందేండ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టులను కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కట్టిండ్రు’ అని హరీశ్‌రావు తెలిపారు.
కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని కేసీఆర్ ఢిల్లీకి లేఖ రాశారని అంటున్నరు. అందులో తప్పేమున్నది? ఆయన ప్రాణహితకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని రాసిండ్రు. మేము చాలా సిన్సియర్‌గా ఉన్నం. ప్రాణహిత పనులు కొనసాగించినం. జాతీయహోదా ఇవ్వాలని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెలలోనే ప్రధానికి కేసీఆర్ లేఖ రాసిండ్రు. ఇంజినీర్లు ఇచ్చిన అంచనా వ్యయంతో కాళేశ్వరానికి జాతీయహోదా అడగడం తప్పా? ఢిల్లీ నుంచి నిధులు అడగడం తప్పా? పోలవరాన్ని ప్రారంభించిన నాడు అంచనా ఎంత? ఇప్పుడెంత పెరిగింది? అప్పుడు 10 వేల కోట్లు అన్నరు. ఇప్పుడు లక్ష కోట్లకు మించినా తక్కువే. ఏ ప్రాజెక్టుకైనా అంచనా వ్యయం పెరుగుతది.– హరీశ్‌రావు
తమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి తీయలే
‘2007 నుంచి 2014 వరకు ఏడేండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉన్నది. మరి తమ్మిడిహట్టి వద్ద దమ్మిడి పనికూడా ఎందుకు చేయలేదు? ఇప్పడు అధికారంలో ఉన్నది కదా? ఇప్పటికీ తట్టెడు మట్టెందుకు తీయలేదు?’ అని హరీశ్ నిలదీశారు. ‘తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు. చాప్రాల్ అనే జీవ సంపద ఉన్నది. మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు. మరి ఏ బేసెస్ ప్రకారం తమ్మిడిహట్టిని ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు.
కేసీఆర్, హరీశ్‌రావులపై చర్యలు తీసుకోవాలని అంటున్న ఎన్డీఎస్ఏ పోలవరం కూలిన ఘటనపై దానిని కట్టిన కేంద్రాధినేత ప్రధానిపై చర్య తీసుకుంటవా? దానిని ఎగ్జిక్యూట్ చేసే రాష్ట్ర ముఖ్యమంత్రిపై చర్య తీసుకుంటవా? దీనిపై ఎందుకు మాట్లడవు? అది జాతీయ ప్రాజెక్టు. కడుతున్నది కేంద్రం. అది కూలితే ప్రధాని, అక్కడ సీఎం నైతిక బాధ్యత తీసుకోవాలా? దానిపై ఎందుకు మాట్లడవు?’ – హరీశ్‌రావు
కమిషన్ రిపోర్టు ఏకపక్షంగా ఇచ్చినట్టున్నది. అది పూర్తిగా ట్రాష్.. బేస్డ్లెస్.. బేస్‌లెస్ ఎలిగేషన్స్ ఉన్నయి. నచ్చిన పేరాలు లీకులు.. నచ్చని లీడర్లు బాధ్యులు అన్నట్టగా.. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుగా ఉన్నది. చరిత్రలో రాజకీయ వేధింపుల కోసం అనేక కమిషన్లు వేసిండ్రు. అవేవీ న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇది కూడా న్యాయస్థానాల్లో నిలబడదు. ప్రజాక్షేత్రంలో నిలబడదు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తది. సత్యమే నిలబడుతది. – హరీశ్‌రావు
ప్రభుత్వం 60 పేజీలతో విడుదల చేసిన ఘోష్ కమిషన్ రిపోర్టును పరిశీలిస్తే అందులో అన్నీ అబద్ధాలు.. అవాస్తవాలు.. రాజకీయ దురుద్దేశాలు. వండివార్చినట్టుగా ఉన్నది. ఇంతకది పూర్తి రిపోర్టేనా?కమిషన్ రిపోర్టులోని విషయాలనే చెప్పిండ్రా? ప్రభుత్వమేమన్నా వండి వార్చిందా? అన్నది తేలాలె. పూర్తి రిపోర్టు బయటికి వస్తే అసలు విషయాలు తెలుస్తయి. పూర్తి రిపోర్టు బయటికొస్తే బీఆర్ఎస్ తరఫున గట్టిగ స్పందిస్తం.
-హరీశ్‌రావు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నయి. రెండు పార్టీలు కలిసి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నయి. అందులో భాగంగానే కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ పేరిట అబద్ధపు ప్రచారం చేస్తున్నయ్. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే కాళేశ్వరం కమిషన్ రిపోర్టును బయటపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నది.
-హరీశ్‌రావు
ఇటీవల ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. అందులో చనిపోయినవారిలో ఆరుగురి శవాలు నేటికీ దొరకలేదు. ఎస్ఎల్బీసీ కూలితే ఈ రిపోర్టు ప్రకారం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా? దీనికి మీరు సిద్ధమా? ఎందుకు ఈ ద్వంద్వ నీతి? పోలవరానికో నీతి, ఎస్ఎల్బీసీకో నీతి.. మేడిగడ్డకు మరో నీతా?
– హరీశ్‌రావు