హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తేతెలంగాణ): ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ తీర్పు దేశ ప్రజాస్వామ్యానికి లభించిన గొప్ప విజయమని శుక్రవారం ఎక్స్‌వేదికగా అభివర్ణించారు. ఇటీవల ఎలక్షన్ కమిషన్‌తో జరిగిన సమావేశంలో తమ పార్టీ ఓటర్ల తొలగింపు డాటాను ప్రచురించాలని, ఆధార్ ఆధారంగా పౌరసత్వాన్ని ధ్రువీకరించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పారదర్శక, బలమైన ప్రజాస్వామిక ప్రక్రియ భారత రాజకీయాలకు బలమైన వెన్నెముక అవుతుందని తెలిపారు.
‘సుప్రీంకోర్టు తీర్పును తన విజయంగా చెప్పుకొంటున్న రాహుల్‌గాంధీ..ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తారా? వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తారా?’ అని సూటిగా ప్రశ్నించారు. అర్హులందరికీ ఓటు ఉండేలా చూడటం ఎంత ముఖ్యమో ఆ ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకుండా ఉండటం కూడా అంతేముఖ్యమన్న విషయాన్ని రాహుల్‌గాంధీకి గుర్తుచేస్తున్నానని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీకి ప్రజాస్వామ్యంపై నమ్మకముం టే, న్యాయవ్యవస్థపై విశ్వాసముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఆచరణలో పెట్టాలని డిమాండ్ చేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో సంభవించిన క్లౌడ్‌బరస్ట్ ఘటనలో 46 మంది మరణించడం తనను కలిచి వేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. 100 మందికి పైగా గాయపడటం, మరికొందరు గల్లంతవడం దురదృష్టకరమని వాపోయారు. ఈ విషాద ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెస్క్యూ ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు బీఆర్ఎస్ అండదండలు అందిస్తుందని స్పష్టంచేశారు.