హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. బడ్జెట్ కేటాయింపులకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వా కౌట్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు బడ్జెట్ ప్రతులను చింపి, చెవుల్లో పూలు పెట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రజల చెవు ల్లో పూలు పెట్టి మోసం చేస్తున్నదని విమర్శించారు. శుక్రవారం ఉదయం బడ్జెట్ ప్రసంగం మొదలవగానే.. ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించిందని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు.
ముఖ్యంగా బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ప్రస్తావన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి బయటకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. ‘ఆరు గ్యారెంటీలు గోవిందా.. తులం బంగారం గోవిందా.. మహిళలకు రూ.2,500 గోవిందా.. విద్యార్థినులకు స్కూటీలు గోవిందా.. నిరుద్యోగ భృతి గోవిందా.. బడ్జెట్ అంతా బోగస్, 2 లక్షల ఉద్యోగాలు మోసం’ అని నినదించారు. యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ బడ్జెట్లో పేదలు, రైతులు, మహిళలకు ఎలాంటి న్యాయం జరుగలేదని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.