హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. హ్యామ్రోడ్లపై చర్చ సందర్భంగా మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే శనివారం అసెంబ్లీలో గ్రామీణ రోడ్ల నిర్మాణంపై వాడీవేడిగా చర్చ జరిగింది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతనలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. ప్రభుత్వానికి ప్రశ్నాస్ర్తాలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు.
ప్రభుత్వం బడ్జెట్లో ఒకటి చెప్తే, మంత్రి ఏమో మరొకటి చెప్తున్నారని, రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? ప్రైవేట్ ఏజెన్సీకి ఎన్నేండ్లకు అప్పగిస్తున్నారు? రాష్ట్రంపై ఎంత భారం మోపుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ప్రసంగించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రశాంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గందరగోళానికి దారితీసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి కోమటిరెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం ప్రతిపాదించిన హ్యామ్ మాడల్ రోడ్ల నిర్మాణంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణ పురోగతి మందంచిందని చెప్పారు. మొదలు పెట్టిన పనులు కూడా ఆగిపోయాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలేదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి 55 కిలో మీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేసిందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.27వేల కోట్ల అంచనా వ్యయంతో హ్యామ్ మాడల్‌లో 17 వేల కిలో మీటర్ల మేరకు రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్టు తెలిపిందని వివరించారు. రాష్ట్రంలో మొత్తం రోడ్ నెట్వర్కే 32,717వేల కిలో మీటర్లు అని తెలిపారు. కానీ ప్రభుత్వం 17 కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తామని చెప్పడమేంటని, అందులో ఆర్అండ్బీ రోడ్లతోపాటు పంచాయతీరాజ్ రోడ్లు ఉంటాయా? అని ప్రశ్నించారు.
రోడ్ల నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమాధానం చెప్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం వద్ద పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) మాడల్ లేదని, హ్యామ్ మోడల్ వేరు, పీపీపీ వేరు అని తెలిపారు. వెంటనే అటువంటి ప్రతిపాదన లేదుకానీ, 2016 నుంచి కేంద్రం దీనిని అమలు చేస్తున్నదని, హ్యామ్ మాడల్‌ను పలు రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని వివరించారు. అధికారులను పంపి అధ్యయనం చేయిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ప్రశాంత్‌రెడ్డి ఘనకార్యం నాకు తెలుసు.. సెక్రటేరియట్ కట్టే పనులు చూసుడు.. యాగాలు చేసుడే ఆయనకెరుక” అని వ్యాఖ్యలు చేశారు. చివరికి సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ రేపు సమాధానం ఇస్తా అంటూ వెళ్లిపోయారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రోడ్ల నిర్మాణం మందగించిందని మండిపడ్డారు. నిజాలను దాచి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి చేపలపులుసు తినుకుంట వాటర్, నీళ్లను కలుపగల సమర్థుడు అంటూ చురకలంటించారు. మంత్రి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. అసెంబ్లీ విరామ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి కోమటిరెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బాధ్యతగా సమాధానమిస్తే బాగుంటుందని హితవు పలికారు. 40 శాతం ప్రభుత్వ, 60శాతం ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లు వేస్తామమంటూ ఆర్థికమంత్రి భట్టివిక్రమార బడ్జెట్బుక్లో స్పష్టంగా చెప్పారని తెలిపారు. కానీ అలాంటి ప్రతిపాదనలులేవని మంత్రి కోమటిరెడ్డి సమాధానం ఇస్తున్నారని వివరించారు. అలాగే 60 శాతం నిధులను ప్రభుత్వమే వెచ్చిస్తుందంటూ బడ్జెట్‌కు భిన్నమైన వాదనను వినిపించారని మండిపడ్డారు.
బడ్జెట్ బుక్ల్ ఉన్నది కరెక్టా? మంత్రి కోమటిరెడ్డి చెప్పింది కరెక్టా? అని ప్రశ్నించారు. సరైన వివరణ ఇవ్వకపోవడం బాధ్యతారాహిత్యమని వెల్లడించారు. ఇకనైనా స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. హ్యామ్ మాడల్‌లో 28 వేల కోట్లతో రోడ్లను బాగుచేసే పథకంలో ఏ రోడ్లను, ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉందా? 60శాతం అంటే 16,800కోట్లను ప్రైవేటు వాళ్లు పెట్టుబడి పెడితే ఎన్ని ఏండ్లో, ఎంత వడ్డీతో చెల్లిస్తారు? ఈ ఆర్థికభారం రాష్ట్ర ప్రభుత్వం మీద పదేండ్లు పడితే, అది ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వస్తుందా? ఏటా బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్‌కు కూడా మళ్లీ బడ్జెట్ అవసరముంటదని, పదేండ్ల పాటు ప్రభుత్వంపై భారం వేయబోతున్నారా? స్పష్టతనివ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.