హైదరాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): రాజకీయాలను పక్కపెట్టి వరదల గురించి సభలో చర్చిద్దామన్న మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన సూచనను అధికార పార్టీ సభ్యులు తిరస్కరించడంతో బీఏసీ (శాసనసభ వ్యవహారాల కమిటీ) సమావేశాన్ని బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. స్పష్టమైన ఎజెండా లేకుండానే మం త్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరైనట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ రిపోర్టును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సభలో పెట్టి మమ అనిపించాలన్న ఆతృత కనిపించింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.
శాసనసభను ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బీఏసీలో చెప్పినట్టు తెలిసింది. ఆదివారం నాటి సభకు ఎజెండా ఏమిటని హరీశ్‌రావు ప్రశ్నించగా, రాత్రి 9 గంటల తరువాత ఎజెండా నిర్ధారించి వివరాలు పంపిస్తామని చెప్పినట్టు తెలిసింది. సభ 2రోజులే నిర్వహించాలని, ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద ఆదివారం సభలో చర్చలకు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అర్డినెన్స్ బిల్లు ను ఆదివారమే సభలో పెట్టాలని అధికార పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. 2 వారాలపాటు సభను నిర్వహించాలని హరీశ్‌రావు కోరినప్పటికీ 2రోజులకు మించి సభను నిర్వహించడానికి అధికార పార్టీ సభ్యులు అంగీకరించలేదని సమాచారం. అన్ని అంశాలపై చర్చించేందుకు సభకు నాలుగైదు రోజు లు విరామం ఇచ్చి ఆ తర్వాత సభను నడుపుదామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నట్టు తెలిసింది.
వరద గురించి చర్చిద్దాం
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, కేవలం రెండు రోజులు మాత్రమే సభ నిర్వహిస్తే సమయం సరిపోదని, కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలని హరీశ్‌రావు కోరినట్టు సమాచారం. బురద రాజకీయాల గురించి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని, తొలుత వరదలపై చర్చించి తక్షణం ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరినట్టు తెలిసింది. వరదలతో రాష్ట్రం అతలాకుతలమైందని, ప్రాణ నష్టం, పంటనష్టం, ఆస్తినష్టం జరిగిందని, వరదల అంశానికి సభలో మొదటి ప్రాధా న్యం ఇచ్చి చర్చకు అనుమతించాలని హరీశ్‌రావు కోరినట్టు తెలిసింది. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పినట్టు తెలిసింది.