హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో (Jubilee Hills) బీఆర్ఎస్ విజ యం ఎప్పుడో ఖాయమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వ్యూహం, దిశానిర్దేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కార్యాచరణ, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మా జీ ప్రజాప్రతినిధులు సహా సమస్త గులాబీ సైన్యం ‘ఎన్నికల బరిలో తలపడుతున్నది నేనే’ అన్నట్టుగా రంగంలోకి దిగి వార్‌ను వన్‌సైడ్ చేసేశారు. ఈ దెబ్బకు కాంగ్రెస్ (Congress) కకావికలమై ఏం చేయాలో అర్థంకాక తలపట్టుకుంటున్నది. ఢిల్లీ అధిష్ఠానం మొదలు ఉత్తర భారత రాష్ర్టాలు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ర్టాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నుంచి మొదలు మంత్రులు, వారి సామంతులు, సామంతులకు అదనంగా అధికారబలం, ఇతరేతర బలగాల మోహరింపు దళాలను ప్రచారంలోకి ప్రవేశపెట్టినా ఏం చేయాలో దారీతెన్నూ దొరకక అల్లాడిపోతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి సునీతను జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను గుర్తు చేస్తూ ‘సమాజంలోని వివిధ వర్గాలను కాంగ్రెస్ పార్టీ రాచిరంపాన పెడుతున్నది.
అది తెలంగాణ ప్రజలకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. సమయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారి ఆగ్రహానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక సంకేతంగా ఉండబోతుంది. ఈ క్రమంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించే విధంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలి. ఉద్యమస్ఫూర్తిని చాటాలి’ అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ప్రజాభిప్రాయసరళిని గమనిస్తూ పార్టీకి అవసరమైన సూచనలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని డివిజన్లవారీగా ప్రచారంలో ఉన్న బాధ్యుల కార్యాచరణను క్షణంక్షణం పరిశీలిస్తూ అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ కీలకనేత పేర్కొన్నారు. అధినేత నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త దాకా సాగుతున్న కార్యాచరణకు కాంగ్రెస్ శ్రేణులు బిత్తరపోతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రయోజనాలు అనే సింగిల్ ఫార్మాట్‌తో బీఆర్ఎస్ ముందుకు సాగుతుంటే అందుకు విరుద్ధంగా కాంగ్రెస్‌లో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మంత్రుల దాకా తమ ‘రూటే సపరేటు’ అన్నట్టుగా సాగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉన్న కమిట్మెంట్, కేసీఆర్, కేటీఆర్‌తో ప్రజలు కనెక్ట్ అయినట్టు మావాళ్లతో ఎందుకవుతరు? అని సాక్షాత్తు ఒక మంత్రే తన సన్నిహితులతో పేర్కొన్నారనే ప్రచారం సాగుతున్నది.
కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బాకీకార్డు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అందులో భాగమైన 420 హామీలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ అమ్ములపొది నుంచి విడిచిన బాకీకార్డు బాణం కాంగ్రెస్ పార్టీని చితక్కొడుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బాకీకార్డు తీవ్రత రేవంత్‌రెడ్డి పాలనను సుడిగుండంలో ముంచెత్తబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నిక ప్రచారంలో బాకీకార్డును ఇంటింటికీ పంచింది. మనిషి మనిషిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలు, అధికారమే పరమావధిగా రేవంత్‌రెడ్డి చేసిన వాగ్దానాలకు జూబ్లీహిల్స్ ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పును ఇస్తారనే ఆశాభావం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఏరుదాటాక తెప్పను తగలేయటం హస్తంతో అబ్బిన విద్య అన్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తేటతెల్లమైంది.
నియోజకవర్గంలోని ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, షేక్‌పేట, బోరబండ తదితర ప్రాంతాల్లో ప్రజలు బాహాటంగానే ఆ మాట చెప్తున్నరు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం అందిచ్చిన రూ. లక్షా 116తోపాటు తులం బంగారం ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్ తీరా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ‘అప్పుడు తులం రూ. 50వేలు ఉండే. ఇప్పుడు రూ. 1.3 లక్షలు అయింది. అది ఇవ్వడం సాధ్యం కాదు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఆయా కాలనీల్లో ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. 23 నెలలుగా ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, జూబ్లీహిల్స్‌లో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ‘ఏమీ ఇవ్వబోమని చెప్పినా మాకే ఓటేశారు. ఇక ఏ హామీని అమలు చేయాల్సిన అవసరం లేదు’ అని చేతులెత్తేస్తారనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు.
ట్రెండ్‌సెట్ చేసిన కేటీఆర్ రోడ్‌షోలు
కేటీఆర్ రోడ్‌షోలు గులాబీ ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గంలోని డివిజన్లు, కాలనీల వారీగా ముఖ్యనాయకులు, ఆయా సామాజికవర్గాల ప్రతినిధులను కలవటం, పార్టీ శ్రేణులకు ఏ రోజుకు ఆ రోజు అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత కేసీఆర్ నుంచి వచ్చే ఆదేశాలను, దిశానిర్దేశాన్ని వివరించడం, మరోవైపు రాత్రి రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. అలాగే, మాజీ మంత్రులు తలసాని, సబితారెడ్డి, పద్మారావు, మల్లారెడ్డి సహా సమస్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు తన తండ్రి మరణంతో ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉన్నా తన ఇంటి నుంచే తన బాధ్యతలను పర్యక్షేస్తున్నారు. ఇలా ఎవరికి వారు పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన అసైన్మెంట్ను నిర్వహిస్తున్నారు. సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో గులాబీ సైనికులు ప్రతీ ఒక్కరిని కలుస్తూ పదేండ్ల కేసీఆర్ పాలనకు, 23 నెలల రేవంత్‌రెడ్డి పాలనను విడమరచి చెప్తున్నారు.