హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిచోటా మాట్లాడే మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎన్నారైలను హేళన చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఆయనపై అమెరికా సహా వివిధ దేశాల్లోని తెలంగాణ ఎన్నారైలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది’ అని బీఆర్ఎస్ యూఎస్ఏ విభాగం చైర్మన్ మహేశ్ తన్నీరు తెలిపారు. ఎందరికో ఆదర్శంగా ఉండాల్సిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. వెగటు పుట్టించేలా మాట్లాడటం శోచనీయమని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. సీఎంగా రేవంత్‌రెడ్డి తమ బాగుకోసం పనిచేస్తాడని, ప్రతిపక్షాలతో కూడా గౌరవభావంతో ఉంటూ ప్రగతి లక్ష్యాల వైపు పయనిస్తాడని ప్రజలు ఆశించారని, కానీ వారి ఆశలు అడియాశలయ్యాయని తెలిపారు. ప్రతిపక్ష నేతలు సంధించే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా, దుర్భాషలాడుతూ వారి వ్యక్తిత్వాన్ని తూలనాడటం గర్హనీయమని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రవర్తనతో సీఎం పదవికి ఉన్న ప్రతిష్ఠ తగ్గడమే కాకుండా, ప్రజల్లో ఆయనపై చులకన భావం ఏర్పడుతుందని హెచ్చరించారు. పదవి శాశ్వతం కాదని, దానిని అడ్డదారులో వెళ్లి కాపాడుకోవడం అసాధ్యమని, మళ్లీ గెలువడం అనే విషయాన్ని పక్కనబెట్టి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పాలనలో ఉన్న మంచి, చెడుల గురించి ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత అని, దానిని బీఆర్ఎస్ సమర్థంగా నిర్వహిస్తుంటే, పార్టీపై, నేతలపై దుర్భాషలాడటం పూర్తిగా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని దుయ్యబట్టారు. ప్రజలు, ఎన్నారైలు కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలు సునిశితంగా పరిశీలిస్తున్నారని, సరైన సమయంలో వారు సరైన విధంగా స్పందిస్తారని తెలిపారు. ఎన్నారైలు ఎక్కడ ఉన్నా మాతృభూమిపై ప్రేమతో తమవంతు పాత్ర పోషిస్తున్నారని, వారిని చులకన చేస్తూ మాట్లాడటం సబబు కాదని సూచించారు. ఎన్నారైలపై ఇక నుంచి ఎవరైనా.. విద్వేషకరమైన భాష మాట్లాడితే, చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడేది లేదని మహేశ్ తన్నీరు హెచ్చరించారు.
‘శ్రమజీవుల కష్టాన్ని అలుసుగా చేస్తూ, విదేశాల్లో కష్టపడి పనిచేసే వారిని బాత్రూమ్లు కడుక్కునే వారిగా చిత్రీకరిస్తారా? వారిని కించపరిచే విధంగా మాట్లాడుతారా?’ అని రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఖతార్ విభాగం అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని మండిపడ్డారు. ఎన్నారైలను ఇలా తూలనాడటం రేవంత్‌రెడ్డి అజ్ఞానానికి పరాకాష్ఠ అని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. లక్షలాది మంది ఎన్నారైల శ్రమను, వారి ఆత్మగౌరవాన్ని అవమానించే అధికారం రేవంత్‌రెడ్డికి ఎవరిచ్చారు? అని నిలదీశారు. పొట్టకూటి కోసం అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, యూరప్ తదితర దేశాల్లో చలి గాలుల్లో, గల్ఫ్ లాంటి ఎడారి దేశాల్లో కడుపులు మాడ్చుకుని, తమ కుటుంబాల కోసం కష్టపడుతున్న కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు తమ కంటికి కనపడటం లేదా? అని మండిపడ్డారు. స్వయంకృషితో ఎదిగి, దేశానికి విదేశీ మారకాన్ని అందిస్తున్న మేధావులను ఎగతాళి చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి ఉన్న ‘మరుగుజ్జు’ బుద్ధితో మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి మనోభావాలను దెబ్బతీశాయని తెలిపారు. తక్షణమే తన అనాలోచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి, సీఎంగా తన గౌరవాన్ని కాపాడుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.
ఎన్నారైలను కించపరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మండిపడ్డారు. తెలంగాణ ఎన్నారైలపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం వివిధ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు తమ పనులు తాము చేసుకోవడాన్ని కూడా సీఎం రేవంత్‌రెడ్డి అవమానకరంగా మాట్లాడటం, ఎగతాళి చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ గడ్డ అంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక అని, అలాంటి ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ఊరుకునే ముచ్చటే లేదని స్పష్టంచేశారు.ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.