హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సినిమా పరిశ్రమకు చెందిన నటులపై నీచంగా మాట్లాడిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకురాలు, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ జాతీయ మహి ళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.
బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యంగా, సమాజ నిర్మాణానికి హాని కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కమిషన్కు ఫిర్యాదు లేఖ పంపించారు.
మంత్రి మాటలు మహిళలపై అనవసరమైన అనుమానాలు కలిగిస్తాయని, వారి వ్యక్తిగత, వృత్తి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు మహిళలు తమ లక్ష్యాలను సాధించటంలో నీరుగారుస్తాయని వివరించారు. సురేఖ కుసంస్కార వ్యాఖ్యలు మహిళలు సమాజంలో పురోగతి సాధించడానికి ప్రతిబంధకంగా మారుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా, ప్రోత్సాహకరంగా మాట్లాడాలి తప్ప అసంబద్ధ, నిరాధార వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మంత్రి సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.