హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు, కులగణనపై అధ్యయనం చేసేందుకు తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో పర్యటించాలని బీఆర్ఎస్ బీసీ ముఖ్యనేతలు నిర్ణయించారు. బీసీల కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశాలపై ఆయా రాష్ర్టాల్లో అధ్యయనం చేయనున్నారు. శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో శనివారం తెలంగాణ భవన్లో బీసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఇటీవల జరిగిన సమావేశంలో వివిధ రాష్ర్టాల్లో ఉన్న మెరుగైన విధానాలను అధ్యయనం చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు, కేరళలో అమలు చేస్తున్న రిజర్వేషన్లు, తమిళనాడు ప్ర భుత్వ చిత్తశుద్ధి వల్ల బీసీలకు దక్కిన రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి, పార్టీకి అందించాలని నిర్ణయించారు. నవంబర్ 10లోగా కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కులగణన చేసి, 42 శాతం రిజర్వేషన్ల కల్పన, బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించక పోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించారు.
సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగ య్య యాదవ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, జాజాల సురేందర్, నోముల భగత్, దాసోజు శ్రవణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవి కుమార్ గౌడ్, జూలూరి గౌరీ శంకర్, డాక్టర్ ఆంజనేయ గౌడ్, చిరుమల్ల రాజేశ్ కుమార్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్‌గౌడ్, ఉపేంద్రాచారి, బీఆర్ఎస్ నాయకులు గట్టు రాంచందర్‌రావు, గోసుల శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.