హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని ‘స్వేదపత్రం’ పేరుతో ఆదివారం విడుదల చేయనున్నది. నిజానికి ఈ కార్యక్రమాన్ని శనివారమే నిర్వహిద్దామనుకున్నా, వైకుంఠ ఏకాదశి కావడం, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు దేవాలయ దర్శనాలకు వెళ్లడం, మాజీ ప్రధాని పీవీ వర్ధంతి తదితర కారణాల వల్ల ఆదివారానికి వాయిదా వేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి తేడా లేకుండా రెకల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించం.
విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిషరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా స్వేదపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నామని శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం వల్ల వాయిదాపడిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భవన్లో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.