Miss World | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న వారికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదగిరిగుట్ట, కొత్తగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనం, సెక్రటేరియట్‌తోపాటు రామోజీ ఫిల్మ్‌సిటీ, చౌమొహల్లా ప్యాలెస్, చార్మినార్, రామప్ప దేవాలయం తదితర కట్టడాలను చూపిస్తున్నారు తప్ప ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా కేసీఆరే నిర్మించిన.. 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు చూపించడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ ప్రశ్నించారు.
అంబేద్కర్ విగ్రహం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు వివక్ష చూపుతున్నారని, ఇది దేనికి సంకేతమని నిలదీశారు. తెలంగాణ భావన్లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన ఎందరో బలిదానాలకు గుర్తుగా కేసీఆర్ నిర్మించిన అమరజ్యోతి రాష్ట్రానికే గర్వకారణమని, అలాంటి అమరజ్యోతిని సందర్శించడానికి అందాల పోటీదారులను ఎందుకు తీసుకెళ్లడం లేదని ఆయన మండిపడ్డారు.
ఈ నెల 31తో అందాల పోటీలు ముగుస్తాయని, ఆ తర్వాత.. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున వారిని రాష్ట్ర గవర్నర్‌ను కలువడానికి తీసుకెళ్లడం సంతోషమే అని పేర్కొన్నారు. అయితే ఈలోగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించి.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, వారి జీవిత చరిత్రను.. ఆ పక్కనే ఉన్న అమరజ్యోతిని సందర్శింపజేసి, వాటి ప్రతిష్ఠ, ప్రాధాన్యతల గురించి అందాల పోటీదారులకు సమగ్రంగా వివరించాలని సూచించారు. కాళేళ్వరం కమిషన్ నోటీసులపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. కమిషన్ నోటీసులు ఇచ్చినట్టు తెలిసిందని, మరి ఆ నోటీసులో ఏముందో తెలిసిన తర్వాతే స్పందిస్తామని ఆయన చెప్పారు.