Telangana | దివంగత రాజీవ్‌గాంధీ మాజీ ప్రధాని. మహనీయుడు. దేశం కోసం ప్రాణాలర్పించిన నేత. ఆయనను ఇప్పటికే అనేక విధాలుగా గౌరవించుకున్నం. మరింతగా కూడా గౌరవించుకోవచ్చు. అభ్యంతరం లేదు!
రాజీవ్‌గాంధీకి, తెలంగాణకు ఏం సంబంధం? విగ్రహం ఇప్పుడెందుకు? ఇక్కడే ఎందుకు? తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలని సంకల్పించిన చోటే, పట్టుబట్టి రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏమున్నది?
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. ఆ సమున్నత వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే భారీ విగ్రహం అటువైపు! వందలాది అమరుల ఆకాంక్షల ఫలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. వారి సముజ్వల త్యాగాన్ని ప్రజ్వలించే అమర జ్యోతి ఇటువైపు! ఆ రెండింటి మధ్యలో… నాలుగున్నర కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన పాలకుల కొలువు సచివాలయం. తరతరాలపాటు ఆ సచివాలయంలో కూర్చునే ఏలికలు… అంబేద్కర్ ఆశయాలను, అమరుల త్యాగాలను మరువకుండా, తెలంగాణ స్ఫూర్తి అనే కర్తవ్యం కనుమరుగు కాకుండా పరిపాలించాలనే సందేశం ఇచ్చే సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. కానీ రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్‌లో వేరే స్థలమే లేనట్టు, మరే సంస్థకూ రాజీవ్ పేరు లేనట్టు, భాగ్యనగరంలో ఇంకెక్కడా ఆయన విగ్రహం పెట్టలేమన్నట్టు.. సచివాలయానికి-అమర జ్యోతికి నడుమ రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించింది.
ఒకప్పుడు తెలుగు తల్లి విగ్రహం ఉన్నచోటు అది. తెలంగాణపై సమైక్య పాలకుల ఆధిపత్య భావజాలానికి నాటి తెలుగు తల్లి ఒక ప్రతీక అయితే, కాంగ్రెస్ ఆధిపత్య భావనకు నేటి రాజీవ్ విగ్రహం ఒక ప్రతీక! తెలంగాణ ఆత్మను అవమానించి, ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టి, పదవుల కోసం పాదాలకు మోకరిల్లే మనస్తత్వాల వికృత క్రీడ ఇది.
నిజానికి దివంగత రాజీవ్‌గాంధీయే బతికి ఉన్నా ఈ దుర్మార్గాన్ని సహించేవారు కాదే మో! ఈ విగ్రహావిష్కరణకు చివరికి రాజీవ్ కుటుంబ సభ్యుల ఆమోదమూ ఉన్నట్టు లేదు. అనేకసార్లు ప్రాధేయపడినా వారు కనికరించలేదు. సరికదా కనీసం అభినందన సందేశమైనా పంపలేదు!
మరెందుకీ తాపత్రయం? మరి దేనికోసమీ ఆత్మవంచన? నాలుగున్నర కోట్ల ప్రజల మనస్సంకల్పాన్ని, పోరుగడ్డ తెలంగాణ బిడ్డల గరిమను అవమానించే ఈ ప్రయత్నం ఎందుకు? పదేండ్లుగా పదిలంగా కాపాడుకున్న తెలంగాణ జ్వాలను పది నెలల్లోనే ఆర్పేయాలన్న ఆరాటం, ఎవరి ప్రయోజనాల కోసం?!