KTR | హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తేతెలంగాణ): లగచర్ల రైతుల కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రైతులు, పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్ విషయంలో నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయని, బుధవారం బెయిలు వస్తుందని లాయర్లు చెప్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ బెయిలు రాకున్నా అధైర్యపడాల్సిన అవసరం లేదని, మంచి లాయర్లను పెట్టి హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టులోనూ కొట్లాడతామని స్పష్టం చేశారు. తన గురించి కాకుండా రైతులకు బెయిల్ ఇప్పించాలని అడుగుతున్న నరేందర్‌రెడ్డి గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయనకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లుడు, అదానీ కోసమే కొడంగల్ భూములు గుంజుకొంటూ రైతులను చెరబడుతున్నారని నిప్పులు చెరిగారు. నిజంగా నియోజకవర్గ ప్రజలపై ప్రేమ ఉంటే వెల్దండలో రేవంత్‌కు ఉన్న 500 ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలు పెట్టాలని డిమాండ్ చేశారు. భూములివ్వబోమన్న లగచర్ల రైతులు, అన్యాయాన్ని ప్రశ్నించిన పట్నం నరేందర్‌రెడ్డిని 35 రోజులుగా జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. బాధిత రైతాంగానికి బీ ఆర్ఎస్ దండు, కేసీఆర్ దళం అండగా ఉం టుందని భరోసా ఇచ్చారు. అటు కోర్టులో, ఇటు అసెంబ్లీలో పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.
‘రేవంత్‌రెడ్డీ.. అరెస్ట్, అరెస్ట్ అంటూ భయపెట్టుడు కాదు. నీకు దమ్ముంటే కనీసం 15 రోజులు అసెంబ్లీని నిర్వహించు. పది రోజులు ప్రజా సమస్యలపై మిగిలిన ఐదు రోజులు మీరు ఆరోపిస్తున్న ఫార్ములా-ఈ పై చర్చపెట్టు’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘ఏ ప్రభుత్వంపైనైనా మూడు, నాలుగేండ్లలో వ్యతిరేకత వస్తది. కానీ, నక్కజిత్తుల రేవంత్‌రెడ్డి రంగు ఏడాదిలోనే బయటపడ్డది’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్‌లో ప్రజా సమస్యలను గాలికొదిలి వీరిని అరెస్ట్ చేయాలా? వారిని జైలులో పెట్టాలా? అనే అంశాలపై చర్చిస్తున్నారని ఆరోపించారు. లగచర్ల నుంచే రేవంత్‌రెడ్డి పతనం మొదలు కానున్నదని చెప్పారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను అరిగోస పెడుతున్నదని విమర్శించారు.
30 శాతం మందికే రుణమాఫీ చేసి, వానకాలం రైతుబంధు ఎగ్గొట్టి రైతులను నిండా ముంచిందని మండిపడ్డారు. ఈ విషయంపై రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెతో పాటు రాష్ట్రంలోని ఏ ఊరిలోనైనా చర్చించేందుకు సిద్ధమేనని సవాల్ విసిరితే ముఖ్యమంత్రి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో అటు రాహుల్‌గాంధీ నుంచి కాంగ్రెస్ కార్యకర్త దాకా అందరూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అటు ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని ఇటు పాఠశాల విద్యార్థుల వరకు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కొడంగల్‌లో ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ, అల్లుడి ఫార్మా కంపెనీల కోసమే రైతుల భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. కనీసం వార్డు మెంబర్ కూడా కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారని నిప్పులు చెరిగారు. పోలీసులు, అధికారులను వెంటబెట్టుకొని తిరుగుతూ అరాచకాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. భూములివ్వబోమన్న పాపానికి లగచర్ల రైతులను అర్ధరాత్రి అరెస్ట్ చేయించారని ధ్వజమెత్తారు.
పిల్లాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తట్టుకోలేని రేవంత్‌రెడ్డి తమ పార్టీ అధినేతను అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం విడ్డూరమన్నారు. తమకే సమాధానం చెప్పలేక పారిపోతున్న ఆయనకు కేసీఆర్ ఎందుకని ప్రశ్నించారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో లగచర్ల ఘటనపై చర్చించాలని డిమాండ్ చేశారు. అత్యంత ముఖ్యమైన సమస్యలను పక్కనబెట్టి టూరిజంపై చర్చపెట్టడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు.
ప్రజాపాలన అని చెప్పి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ల పాలన సాగిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మెట్రోకు నష్టం వస్తున్నదని చెప్పిన ఎల్అండ్టీ ఎండీని అరెస్ట్ చేస్తామని బెదిరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఫంక్షన్లో తన పేరు మరిచిపోయినందుకు సినిమా నటుడిని జైల్లో పెట్టిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. ఫార్మా వద్దన్న సొంత నియోజకవర్గ రైతులతో పాటు కులగణన సర్వేకు వెళ్లిన పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్రావును జైలుకు పంపారని విమర్శించారు. ఫార్మా కోసం తొండలు కూడా గుడ్లుపెట్టని భూములు తీసుకుంటున్నామని అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రికి ఓ గిరిజన ఆడబిడ్డ ఆ భూముల్లో పండిన వడ్ల రాశులను చూపించి బుద్ధిచెప్పిందని గుర్తుచేశారు. చేతులకు సంకెళ్లు వేసుకొని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిరసన తెలిపి ఈ సమస్యను ఎలుగెత్తిచాటారని గుర్తుచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో లగచర్లపై చర్చపె ట్టాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స వాల్ చేశారు. చర్చకు రెండు రోజులుగా తాము పట్టుబడుతుంటే సర్కార్ పారిపో తున్నదని ఎద్దేవాచేశారు. శాసనసభను కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు చెప్పుకొనే వేదికగా మార్చారని విమర్శించారు. జనగా మ, బోథ్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రె డ్డి, అనిల్జాదవ్తో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
‘రేవంత్‌రెడ్డికి నేరుగా మమ్మల్ని ఎదురొనే ధైర్యం లేక కేటీఆర్ గురించి లీకు లిచ్చి అనుకూల మీడియాలో దొంగ రా తలు రాయించి బతుకుతున్నడు. ఇలాంటి రాతలు బంద్ చెయ్యి రేవంత్’ అంటూ విరుచుకుపడ్డారు. దమ్ముంటే శాసనసభను పదిహేను రోజులు నడపాలని సవాల్ చేశారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్ లేకుండా బిల్లులు ప్రవేశపెట్టడం ఏమిటని, ఇది అసెంబ్లీ సమావేశాల సంప్రదాయాలకు విరుద్ధమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసెంబ్లీలో లగచర్ల ఘటనపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడుతుంటే ప్రభుత్వం పారిపోతున్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రెండు రోజుల నుంచి ముఖ్యమంత్రి అసెంబ్లీలో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజాసమస్యలపై నిలదీస్తూ సర్కారుకు కొరకరాని కొయ్యలా మారిన కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి మాయమాటలు నమ్మి గెలిపించిన పాపానికి గిరిజనులను అరిగోస పెడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఉపాధి కల్పించాల్సిన ఆయన భూములు గుంజుకొని అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఇక్కడి ప్రజలు, నరేందర్‌రెడ్డి కలిసి తనను ఓడించారనే అవమానంతో ముఖ్యమంత్రి ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు. దురహకారంతో ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి గిరిజనులు తిరగబడిన తీరుచూసి చివరికి ఫార్మాను వెనక్కి తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం సొంత నియోజకవర్గంలోని లగచర్ల లంబాడీ బిడ్డల నుంచే ప్రజాపాలనకు ప్రతిఘటన మొదలైందని ఎమ్మెల్సీ దేవపతి శ్రీనివాస్ అన్నారు. లగచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టమని అడిగితే టూరిజాన్ని ముందుకుతెచ్చి తప్పించుకుంటున్నారని దెప్పిపొడిచారు. రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో ఆయన రంగు వెలిసిపోయిందని విమర్శించారు. దగాపడ్డ లంబాడీ బిడ్డలను ఢిల్లీకి తీసుకెళ్లి సర్కారు అరాచకాలను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్పనేత కేటీఆర్ అని అభినందించారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా లగచర్ల బాధితులకు గులాబీ జెండా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఫార్మా కంపెనీకి భూములివ్వబోమని లగచర్ల రైతులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. తెలంగాణనే కాదు దేశరాజకీయాలను మార్చే శక్తి, సత్తా ఈ పోరాటానికి ఉన్నదని చెప్పారు. లగచర్ల రైతుల ఉద్యమాన్ని చూస్తుంటే 1948లో జరిగిన సాయుధ పోరాటం గుర్తుకు వస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మెతుకు ఆనంద్, నేతలు పొన్నాల లక్ష్మయ్య, గజ్జెల నగేశ్, కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘భూములివ్వబోమన్న పాపానికి లగచర్ల గిరిజన బిడ్డలను సర్కారు నిర్బంధించడం సరికాదు. ఇదేం ప్రజాస్వామ్యం’ అంటూ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆక్షేపించారు. కాలేటి కడుపుల మీద పలుగురాళ్లు కొట్టుడెందుకని నిలదీశారు. ‘నీకు దమ్ముంటే బలిసినోళ్లను కొట్టు. అంతేగానీ గిరిబిడ్డల జోలికిరావద్దు’ అని హితవు పలికారు. గుండెపోటు వచ్చిన రైతును పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన గాలి వీచే లగచర్లలో ఫార్మా చిచ్చుపెట్టారని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి ఘనమైన పోరాట చరిత్ర ఉన్నదని, అదే స్ఫూర్తితో గిరిజన బిడ్డలు కొట్లాడారని అభినందించారు. బాధిత రైతులకు కేటీఆర్‌తో పాటు కవులు, కళాకారులు అండగా ఉంటారని తేల్చిచెప్పారు. సర్కారు అనాగరిక పద్ధతులను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు.