తెలంగాణ ప్రజల తోడు నీడగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 ఏండ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, రజతోత్సవానికి సిద్ధమైన చరిత్రాత్మక సన్నివేశమిది. తెలంగాణ మేలు కోసం, తెలంగాణలో పుట్టి, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా నిలిచి, పోరాడి గెలిచి, తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా అనితర సాధ్యమైన పరిపాలన సాగించి, తెలంగాణ పార్టీగా ఇంటింటికీ చేరి, 25 ఏండ్లుగా ప్రజల గుండె గుడిలో కొలువై, చెక్కు చెదరని రాజకీయ శక్తిగా నిలవడమనేది అనుకున్నంత ఆషామాషీగా, అంత అలవోకగా జరిగిందేమీ కాదు. బీఆర్ఎస్, దాని నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎదుర్కొన్నంత ప్రతికూలతను, అణచివేతను, దూషణను, ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో మరే రాజకీయ పార్టీ లేదా దాని రథ సారథి ఎదుర్కొనలేదంటే అతిశయోక్తి కాదు. బీఆర్ఎస్ ఎట్ల పుట్టింది? ఉద్యమాన్ని కేసీఆర్ ఎంత వైవిధ్యంగా నడిపారు? ప్రత్యేక రాష్ట్రం ఎట్ల సాకారమైంది? పదేండ్లలో అద్భుతమైన ప్రగతి ఎట్ల సాధ్యమైంది? ఇదంతా మన కండ్ల ముందే జరిగిన మహత్తర చరిత్ర. మళ్లీ చెప్తే చర్విత చర్వణం! ఇప్పుడు మన ముందున్న సందేహం.. రజతోత్సవం కేవలం సంబురాల సమయమా? లేక అంతకుమించి ఇంకేమైనా ఉన్నదా?
ఒకప్పుడు ప్రత్యేక రాజ్యంగా ఉన్న తెలంగాణ, కాల ప్రవాహంలో ఒకానొక రాష్ట్రమై, తర్వాత కేవలం ఉప ప్రాంతమై ఉనికినే కోల్పోయే ఉత్పాతాన్ని ఎదుర్కొంటున్న ప్రమాదభరిత వాతావరణంలో కేసీఆర్ ఉద్యమ జెండాఎత్తుకున్నరు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమాన్ని పరివ్యాప్తం చేసిన అన్నాదురై తరహాలో, అక్కడాఇక్కడా చెల్లాచెదురుగా ఉన్న తెలంగాణ భావజాలాన్ని ముద్దగా చేసి, అఖండ శక్తిగా మలిచారు. మూడు కోట్ల మంది ఆవేశాన్ని గుట్టుగా తన గుండెలో దాచుకుని, వారి ఆగ్రహాన్ని సభల్లోకి పొదిగి, వారి ఆక్రోశంలోకి తనకు తానై ఒదిగి, తెలంగాణ ఉక్రోషాన్ని ఉరకలెత్తే ఉపన్యాసంగా మార్చి, బతుకు బంధాలనే ఉద్యమ రూపాలుగా మలిచి, ఆటుపోట్లకు ఎదురునిలిచి, విజయ తీరంలో తెలంగాణను నిలిపిన తెగువ కేసీఆర్‌ది! బీఆర్ఎస్ రజతోత్సవం… ఓపికగా ఎత్తులకు పైఎత్తులు వేసి పోరాడే తత్వం మనలో ఇంకా ఉన్నదా? ఉడిగిపోయిందా? అని తరచిచూసుకునే సందర్భం.
1969 ఉద్యమం అణగారిపోయిన తర్వాత, ఇక ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల నాయకుడు వస్తాడా? అని ముక్కోటి దేహాలు ముప్పిరిగొన్న సందేహాలతో వెతుకుతున్న తరుణంలో, నేనున్నానంటూ వచ్చి, వెనుకబడిన వేదనలో నుంచి గులాబీ జెండాను రెపరెపలాడించి, తెలంగాణను ఊగించి, ఉరికించి, ప్రేమించి, శాసించి, గెలిపించిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైన రోజు దేశంలోని అన్ని పార్టీలూ తెలంగాణకు వ్యతిరేకం. పద్నాలుగేండ్ల ఉద్యమం తర్వాత దేశంలోని దాదాపు అన్ని పార్టీలూ తెలంగాణకు అనుకూలం. పార్టీలైనా, వ్యవస్థలైనా, రాజకీయమైనా తెలంగాణకు అనుకూలంగా మారవలసిందే అనే అనివార్యతను సృష్టించిన వ్యూహకర్త కేసీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవం… కేసీఆర్ నేర్పించిన వ్యూహ చతురత మనలో ఇంకా మిగిలి ఉన్నదా? ఉద్యమంతోనే మాయమైపోయిందా? అని ప్రశ్నించుకునే సందర్భం.
గుప్పెడు మందితో మొదలైన ఉద్యమాన్ని ఉప్పెనగా ఎలా మార్చవచ్చో చూపించిన నేర్పరి కేసీఆర్. ధన బలానికి జన బలంతో జవాబు ఎలా చెప్పాలో చూపించిన సాహసి కేసీఆర్. పెద్దగా వనరులు లేకున్నా వ్యూహం ఉంటే విజయం సాధ్యమేనని నిరూపించిన దార్శనికుడు కేసీఆర్. మాట, పాట, ఆటలతోనూ ఢిల్లీ కోటలను బద్దలు కొట్టి, కావాల్సిన ఫలితాన్ని గుంజుకోవచ్చని, కాటగల్సిన రాష్ర్టాన్ని మళ్లీ వెతికి పట్టుకోవచ్చని రుజువుచేసిన పోటుగాడు కేసీఆర్. కవులలో కవిగా, కళాకారుల్లో కళాకారుడిగా, పాత్రికేయుల్లో పాత్రికేయుడిగా, ఉద్యమకారుల్లో ఉద్యమకారుడిగా, నాయకుల్లో నాయకుడిగా కలిసిపోయి, గమనాన్ని వీడకుండా, గమ్యాన్ని మరువకుండా లక్ష్యాన్ని చేరడం ఎట్లాగో చూపిన చుక్కాని కేసీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవం… కేసీఆర్ చూపించినవన్నీ కాకున్నా, కనీసం తెలంగాణవాదుల్లో తెలంగాణ వాదిగానైనా మనం ఉన్నామా? అని ఎవరికి వారుగా తేల్చుకునే సందర్భం.
ప్రజా సమూహంగా కలిసికట్టుగా కలబడినప్పుడల్లా తెలంగాణ ఎదురులేని విజయం సాధించింది. తడబడి విడిపోయిన ప్రతిసారీ విషమ స్థితిలోకి జారుకున్నది. తొందరపాటులో ‘ఎవరు మన? ఎవరు పరాయి?’ అని తేల్చుకోవడంలో తికమకపడ్డ అన్నిసార్లూ తెలంగాణ కకావికలమయ్యింది. 13 ఏండ్ల వీరోచిత ఉద్యమం, 10 ఏండ్ల వైభవోపేత పాలన తర్వాత కూడా తెలంగాణ ఇప్పుడు మళ్లీ చౌరస్తాలో నిలబడి, దిక్కులు చూడాల్సిన స్థితికి చేరుకున్నదంటే కారణం అదే. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ కాదు. అది మూడున్నర కోట్ల మందిని ఒక్కతాటి మీదికి తెచ్చిన వేదిక. తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలనే ఉమ్మడి ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ను మరిచి, కొత్త ముసుగులో వచ్చిన వలసవాదపు సుడిగాలిని నమ్ముకోవడం వల్లే తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నది. బీఆర్ఎస్ రజతోత్సవం… ఈ పరీక్షా సమయం నుంచి బయటపడే దీక్షాదక్షత మనకు ఉన్నదా? లేదా? అని సమీక్షించుకునే సందర్భం.
మలిదశ ఉద్యమం మొదలైన 25 ఏండ్ల తర్వాత, రాష్ట్రం ఏర్పడిన 11 ఏండ్ల తర్వాత తెలంగాణ ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చింది. పదేండ్ల వెలుగులో నుంచి జారిపోయి పద్నాలుగుకు ముందున్న చీకటిలో చిక్కుకున్నది. నిన్నటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేని ఇబ్బందిలో ఇరుక్కున్నది. అందులో తప్పెవరిది? ఒప్పెవరిది? అని తర్జనభర్జన పడాల్సిన తరుణం కాదిది. చేయగలిగినంత మంచి చేసిన కేసీఆర్ ఒకవైపు. చేయకూడనంత చెడు చేస్తున్న కాంగ్రెస్ మరోవైపు. కావాల్సింది సమీక్ష కాదు. ‘బతుకులను కాలుస్తున్న, కూలుస్తున్న ఈ మలుపు నుంచి బయటపడటం ఎట్ల? కలుపు మొక్కలను ఏరేయడం ఎట్ల? రేపటి మన తెలంగాణను నిలబెట్టుకోవడం ఎట్ల?’ అని మథనం చేయాల్సిన సమయమిది. బీఆర్ఎస్ రజతోత్సవం.. మన కర్తవ్య పరాయణతను కాచి వడబోస్తున్న సందర్భం.
‘అన్నా కేసీఆర్ అన్నా! నువ్వు రావాలన్నా’ అని పెడబొబ్బలు పెడితే దబ్బున అరుగు మీంచి లేచి రావడానికి ఇది ఉద్యమ సమయం కాదు. ప్రజాస్వామ్యం. రాజకీయాలు, ఓట్లు, సీట్లు, ఎన్నికలు, ప్రభుత్వాలు సవ్వశేరు నిబంధనలు, సవాలక్ష నిర్బంధాలు! కేసీఆర్ మళ్లీ మనకోసం మన దగ్గరకు రావాలంటే, ముందు మనం కేసీఆర్ దగ్గరికి పోవాలి. బీఆర్ఎస్ రజతోత్సవం… 2001లో పార్టీ పెట్టి పది నాళ్లు కాకముందే, కరీంనగర్ సింహగర్జనకు పిలిచినా పిల్వకున్నా, ఎడ్ల బండ్లు కట్టుకుని ఎగురుకుంటూ దుంకుకుంటూ పోయిన ఆప్యాయత మనలో ఇంకా మిగిలే ఉన్నదా? లేదా? అని తడిమి చూసుకునే సందర్భం.
ఇది తెలంగాణ మరోసారి దీక్ష బూనాల్సిన సమయం. 25 ఏండ్లలో మన కండ్ల ముందు ఏం జరిగిందో మననం చేసుకుని కదలాల్సిన సమయం. రైతుల కోసం చేసిన మంచిని, ఇచ్చిన పథకాలను తిరిగి తెచ్చుకునేందుకు పోరాడాల్సిన సమయం. నదీ జలాల్లో మరోసారి మన వాటా కొల్లగొట్టబడకుండా కాపాడుకోవాల్సిన సమయం. మన ఉమ్మడి ఆస్తి అయిన ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు ఒత్తిడి తేవాల్సిన సమయం. మన సొత్తుతో మనం కట్టుకున్న మన ప్రాజెక్టులు మళ్లీ వాడకంలో పెట్టేలా డిమాండ్ చేయాల్సిన సమయం. మన పల్లెను, పట్నాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు కర్రుగాల్చి వాతపెట్టాల్సిన సమయం. ఢిల్లీ గులాములకు వారి స్థానమేమిటో చూపించాల్సిన సమయం. దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చి, ‘బోడి మల్లన్నా’ అని తెడ్డు చూపించేవాళ్లకు.. తిరగబడ్డ తెలంగాణ సరైన గుణపాఠం నేర్పిందిరా! అని దేశానికి చాటిచెప్పాల్సిన సమయం.
బీఆర్ఎస్ రజతోత్సవం.. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తర్లై పోతుంటే మనం చూస్తూ కూర్చుంటామా? అని తెగించి అడుగుతున్న సందర్భం. తెలంగాణ పరిరక్షణ కోసం మనం మరో ఉద్యమానికి సిద్ధులమై, సన్నద్ధులమై, కంకణ బద్ధులమై కదలగలమా? అని ఆరాతీస్తున్న సందర్భం. మన గుండెల్లో కేసీఆర్ నాటిన తెలంగాణ పోరాట పటిమ మిగిలే ఉన్నదా? అని నిలదీస్తున్న సందర్భం. ఒక సమాజంగా, సమూహంగా తెలంగాణ వాదులందరూ ఒక ప్రశ్న వేసుకోవాల్సిన సందర్భం..
మరో విముక్తి పోరాటానికి మనం సిద్ధంగా ఉన్నామా?
చలో వరంగల్!!