హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎన్నికల స్టంట్ అని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఈ డిక్లరేషన్‌ను బీజేపీ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రిగా బీసీ ఉన్నా ఆ వర్గాలకు ఏమీ చేయలేని బీజేపీ నాయకులు.. బీసీని ముఖ్యమంత్రిని చేస్తే మాత్రం ఏం చేస్తారని నిలదీశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ గణన డిమాండ్స్ తీర్చాలని, బీసీలకు కేంద్ర బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు మంత్రిత్వశాఖ, బీసీ గణన, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, నిధుల కేటాయింపు.. ఈ డిమాండ్లు తీరిస్తే తాము బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దేశంలో దాదాపు 80 కోట్ల మంది బీసీలు ఉన్నా, వారికి బడ్జెట్లో రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయని అసమర్థ పార్టీ బీజేపీ అని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉండి చేయనివి రాష్ట్రంలో చేస్తారా? అని ప్రశ్నించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
కేంద్రం బడ్జెట్లో బీసీలకు రూ.2 లక్షల కోట్లకు కేటాయించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ జన గణనను రాష్ర్టాలు చేసుకోవచ్చని చెప్తున్న బీజేపీ తమ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. డిక్లరేషన్లు కొత్త పార్టీ ఇస్తే అర్థం ఉంటుంది కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇవ్వడంలో అర్థం లేదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
కర్ణాటకలో మత రాజకీయాలు విఫలం కావడంతో బీసీ డిక్లరేషన్ పేరుతో బీజేపీ కొత్త నాటకాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు.బీజేపీ బీసీ డిక్లరేషన్ చిత్తు కాగితంతో సమానమని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమిటని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు ఏమీ చేయని వారు తెలంగాణలో ఏమి చేస్తారని నిలదీశారు. కనీసం బీసీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయని మోదీ బీసీలను ఎలా ఉద్ధరిస్తారు? కేంద్రం బీసీ గణన ఎందుకు చేయడం లేదు? అని నిలదీశారు. కులవృత్తులవారికి రూ.లక్ష చొప్పున చేయూతనందించే పథకానికి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు అభినవ జ్యోతిబాపూలే అని కొనియాడారు. బీజేపీ ఎన్ని ట్రికులు వేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. జీవో 111 రద్దుతో 84 గ్రామాల ప్రజలు పండగ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల కోసం రాజకీయాలు చేయరని, భవిష్యత్తు తరాల బాగు కోసం రాజకీయాలు చేస్తారని కొనియాడారు. సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు.
బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు గొర్రెలు, ముదిరాజ్‌లు, గంగపుత్రులకు చేపల పెంపకం, గౌడలకు, చేనేతకు బీమా ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీకి ఇచ్చినంత బడ్జెట్ కూడా కేంద్రం బీసీలకు వెచ్చించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకిఅని, మండల్ కమిషన్ సిఫారసుల అమలును రథయాత్ర పేరిట అడ్డుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ మాటే తెలంగాణ ప్రజలకు ఓ డిక్లరేషన్.. వేరే ఏ డిక్లరేషన్లు అవసరం లేదని అన్నారు. తాను దళితులను కించపర్చలేదని, తన వీడియోను మార్ఫింగ్ చేసి దళితులను కించపర్చినట్టుగా సోషల్ మీడియాలో, కొన్ని చానళ్లలో ప్రచారం చేశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరణ ఇచ్చారు. మార్ఫింగ్ చేసినట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారని, దానిని ఎక్కడ మార్ఫింగ్ చేశారనే దానిపై విచారణ జరుగుతున్నదని తెలిపారు.