మహబూబ్‌నగర్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఆర్డీఎస్ బాటపట్టనున్నారు. బుధవారం కర్ణాటకలోని రాజోళి బండ డైవర్షన్ స్కీమ్‌ను పరిశీలించనున్నారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్ పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు.
ఇటీవల ఏపీ, కర్ణాటక తుంగభద్ర నదిపై అక్రమంగా సుమారు 65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల అక్రమ రిజర్వాయర్లు, బ్రిడ్జి కం బరాజ్‌లు నిర్మిస్తుండటంతో నడిగడ్డకు రావాల్సిన తుంగభద్ర జలాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని అడ్డుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించడానికి ప్రతినిధి బృందం స్వయంగా ప్రాజెక్టు బాటపట్టింది. ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన తర్వాత కార్యాచరణ రూపొందిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సారి తుంగభద్రతోపాటు కృష్ణ, భీమా నదులపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.