హైదరాబాద్, మార్చి 27(నమస్తేతెలంగాణ): ‘శాసససభ్యుల క్రీడా పోటీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది..మా పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలెవరూ పాల్గొనరు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ప్రజాసమస్యలను పక్కనబెట్టి చట్టసభల సభ్యులకు ఆటలపోటీలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సమస్యలతో సతమతమవుతూ యుద్ధ సంక్షోభాలు ఎదుర్కొంటున్న తరుణంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సమయం వృథా చేయడం ఎంతవరకు కరెక్ట్? అని శుక్రవారం ప్రకటనలో ప్రశ్నించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడలను తెరపైకి తెచ్చి ముఖ్యమైన అంశాలు, పాలనా వైఫల్యాలపై చర్చను ప్రభుత్వం పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. ప్రజాసమస్యలను విస్మరిస్తున్న తీరు ప్రభుత్వ చిత్తశుద్ధిలేమికి అద్దం పడుతున్నదని ధ్వజమెత్తారు. అనేక కీలక అంశాలు పెండింగ్‌లో ఉన్నందున మరో 10 రోజులు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
‘అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేసి క్రీడలు నిర్వహించడాన్ని తెలంగాణ సమాజం హర్షించదు. ఇది మంచి పరిణామం కాదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘నిజంగా సర్కార్‌కు క్రీడాభివృద్ధిపై నిబద్ధత ఉంటే క్రీడాకారులను ప్రోత్సహించాలి. పిల్లలకు అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకు తగిన నిధులు కేటాయించాలి. మేం ఆటలు ఆడి ఒలింపిక్స్‌కు వెళ్లేది లేదు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఆటలు ఆడించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు’అంటూ తేల్చిచెప్పారు. నిజంగా క్రీడల్లో పాల్గొనాలనుకొనే ఉత్సాహవంతులైన సభ్యుల కోసం అసెంబ్లీలో ముందుగా ప్రజాసమస్యలపై చర్చలు పూర్తిచేసి, శాసనసభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత క్రీడలు నిర్వహించుకోవచ్చని, దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండదని స్పష్టంచేశారు. ప్రభుత్వం సైతం ఆటలపోటీల నిర్వహణపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో నిర్వహించిన ఉమెన్స్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్-4కు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ నటుడు సాయికుమార్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డితో కలిసి క్రికెట్ లీగ్‌ను ప్రారంభిచారు. అనంతరం విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. మహిళా వైద్యుల క్రికెట్ లీగ్ ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీని ఆర్గానిక్ పంటలు సాగుచేస్తున్న రైతుల కోసం వినియోగించడం అభినందనీయని పేర్కొన్నారు. రైతాంగానికి అండగా నిలుస్తున్న మహిళా వైద్యులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు.