భీమారం, జూన్ 26 : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీతోపాటు కేసీఆర్ ఫొటో వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు బుధవారం మంత్రి వివేక్ నిర్వహించే కార్యక్రమంలో తనకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్‌ను ఆపేసినట్టు మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లికి చెందిన నక్క సనా – వేణు దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఉదయం పోలంపల్లిలోని తమ గుడిసె ముందు మాట్లాడారు. ఎస్సీ మాదిగ అయినందునే వివక్ష చూపి ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ విషయమై ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి పంచాయతీ కార్యదర్శి సృజనను కలిస్తే.. మంత్రి పీఏ ప్రొసీడింగ్ ఆపేయమని చెప్పారని, బీఆర్ఎస్ స్టేటస్లు ఎందుకు పెడుతున్నారని పంచాయతీ కార్యదర్శి పేర్కొనడంతో వారు కంగుతిన్నారు. వాట్సాప్ స్టేటస్ పెట్టడం వల్లే మంత్రి పీఏకు ఫిర్యాదు వెళ్లిందని, అందుకే ప్రొసీడింగ్ ఇవ్వడం లేదని ఆమె తెలిపినట్టు వారు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అర్హులందరికీ ఇందిరమ్మ ఇవ్వాలని చెప్తున్నారని, ప్రజాపాలన అంటే ఇదేనా? అని వారు ప్రశ్నించారు. ప్రొసీడింగ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.