హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు పెంచబోమని చెప్పిన కేంద్రం.. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం విశ్వాస ఘాతుకమే అవుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3కు పెంచి మళ్లీ లీటరుపై 90 పైసలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింద ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం అన్ని రంగాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలు పెరిగిన పెట్రో ధరలతో ఇబ్బందులు పడు తున్నారని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు దారుణం ; తకళ్లపల్లి శ్రీనివాసరావు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఇటీవల పెరిగిన పెట్రో ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, మళ్లీ ధరలను పెంచడం దారుణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే పెట్రో ధరలను 3 రూపాయలు పెంచిన కేంద్రం.. మళ్లీ 90 పైసలు పెంచడం దారుణమని మండిపడ్డారు. పెట్రో ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని మోదీ సరార్ ఊడిగం చేస్తూ.. పేదల సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఒకరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని తక్కళ్లపల్లి హెచ్చరించారు.