ఎల్లారెడ్డిపేట/ ముస్తాబాద్/ కోనరావుపేట/ చందుర్తి/ రుద్రంగి/ ఇల్లంతకుంట /గూడూరు, ఆగస్టు 12: యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది. అధికారులకు వినతిపత్రాలు అందించి, యూరియా కొరత తీర్చే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో రోడ్డెక్కిన రైతులకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మద్దతుగా నిలిచారు. బీఆర్ఎస్ నాయకులతో పాటు ధర్నాలో బైఠాయించారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పాల్గొ ని రైతులకు మద్దతుగా నిలిచారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పిలుపు మేరకు నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయిం చి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. చందుర్తి మండలకేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ముస్తాబాద్ మండ ల కేంద్రంలో వివిధ గ్రామాల రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.