న్యూస్ నెట్వర్క్, మార్చి14 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్మే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు. హోలీ పండుగ సంబురాలు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణిపై బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహాన్ని ప్రదర్శించాయి. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి. కొన్నిచోట్ల సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలు, ఫ్లెక్సీలనూ దహనం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాలను ఇచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా నినదించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండించారు. అసెంబ్లీలో తమ గొంతు నొకితే ప్రజాకోర్టులో తేల్చుకుంటామని శ్రేణులు హెచ్చరించాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పోటీపడి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు సహా పలు విద్యాసంస్థలకు సెలవు ఉన్నా బీఆర్ఎస్వీ, ఇతర విద్యార్థి నాయకులు ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలపై నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి సాగర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఇతర నేతల నేతృత్వంలో శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ తీశారు. దేవరకొండ, మునుగోడులో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రాస్తారోకో నిర్వహించారు. మఠంపల్లి, నేరేడుచర్ల, పాలకీడులో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దళిత నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో పెద్ద ఎత్తున చేరుకున్న శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ములుగు జిల్లా ఏటూరునాగారంలో సీఏం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఆర్మూర్, మాక్లూర్, వేల్పూర్, కమ్మర్పలి, మోర్తాడ్, బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్ తదితర మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి, ప్రభుత్వ, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలు నిర్వహించి, ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల బీఆర్ఎస్ నేతలను రోడ్లపైకి రాకుండా పోలీసులు అడ్డుకొని, అరెస్టు చేశారు. అయినా గద్వాల, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లో ఆందోళనలు నిర్వహించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇల్లెందు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
దీంతో పోలీసుల చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఠాణా ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నార్నూర్, ఖానాపూర్ మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా చేయడం మంచి పద్ధతి కాదని, ఇది రేవంత్‌రెడ్డి దుష్టపాలనకు నిదర్శనమని విమర్శించారు. ఇచ్చిన హామీలను అసెంబ్లీ వేదికగా జగదీశ్‌రెడ్డి ఎండగట్టిన వైనాన్ని జీర్ణించుకోలేకే ఆయనను సస్పెండ్ చేశారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు విమర్శించారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ప్రతిపక్ష పార్టీ నేతల గొంతు నొక్కేందుకు రేవంత్ సర్కారు యత్నిస్తున్నదని అడ్వకేట్ జేఏసీ అధికార ప్రతినిధి ఉపేంద్ర ధ్వజమెత్తారు.
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సమరోత్సాహాన్ని ప్రదర్శించిన పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హోలీ పండుగలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో నిమగ్నం కావాల్సిన నాయకులు, కార్యకర్తలు పార్టీ పిలుపులో భాగస్వామ్యమై కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కొనియాడారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టిన ప్రజాప్రతినిధి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని.. ప్రజా సమూహం జీర్ణించుకోలేకపోతుందనడానికి నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలూ స్వచ్ఛందంగా పాల్గొనడమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను, హామీల అమలులోని మోసాన్ని ఇదే స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఎండగడదామని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.