మంథని రూరల్/ పెద్దపల్లి(నమస్తే తెలంగాణ) మే 29 : బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ సర్కార్ నిర్బంధం కొనసాగుతున్నది. ప్రభుత్వ విధానాలు, పాలనలో లోపాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్న సోషల్‌మీడియా వారియర్లపై కేసులు పెట్టిస్తూ నిర్బంధిస్తున్నది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన సోషల్ మీడియా వారియర్ జక్కు శ్రావణ్‌కుమార్ ఇటీవల కాళేశ్వరంలో జరిగిన సరస్వతీ పుష్కరాలు, అందాల పోటీల నిర్వహణపై లోపాలు, పలు అంశాలను పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
దీంతో శ్రావణ్‌కుమార్‌పై మంగళవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లికి చెందిన టీపీసీసీ మహిళావిభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆంగోతు సుగుణ కాటారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన టీపీసీసీ సోషల్ మీడియా కార్యదర్శి కైలాస్ సజ్జన్ సైతం హైదరాబాద్‌లో సైబర్ క్రైం సీసీఎస్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి ఖానాపూర్‌కు వచ్చి శ్రావణ్‌కుమార్‌ను అరెస్టుచేసి తీసుకెళ్లారు. విషయం తెలసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ లీగల్ టీంను కలిసి బెయిల్ కోసం కృషిచేశారు. శ్రావణ్‌కుమార్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరుచగా, బీఆర్ఎస్ లీగల్ సెల్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.