హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భవనాలు కూడా పార్టీ ఆఫీసులుగా మారిపోతున్నాయని, ప్రజాభవన్‌లో పార్టీ మీటింగులు నిర్వహించటం దుర్మార్గమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నివాసం కోసం నిర్మించిన ప్రగతిభవన్‌ను కాంగ్రెస్ వచ్చాక ప్రజాభవన్‌గా పేరు మార్చిందని, ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పి పార్టీ ఆఫీసుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతిభవన్‌ను పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సోదరుడు స్వయంగా సెక్రటేరియట్లో కూర్చొని దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ పదవీ లేకున్నా ఆయన సెక్రటేరియట్‌లోకి ఎలా వస్తాడని ప్రశ్నించారు?. ఏ హోదాలో కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రభుత్వమా? లేక గూండాగిరా అని నిలదీశారు.
ఇది అధికార దుర్వినియోగమే? :ఏనుగు భరత్‌రెడ్డి 
ప్రజాభవన్‌లో పార్టీ సమావేశాలు నిర్వహించటం దారుణమని, ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చేశామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేత ఏనుగు భరత్‌రెడ్డి విమర్శించారు. ప్రజాభవన్‌లో కాంగ్రెస్ సమావేశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.