హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారని, అది నిజమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజలను మాయచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500, వృద్ధులకు రూ. 4,000 పెన్షన్, రైతుభరోసా రూ.15వేలు, కౌలు రైతులకు రూ. 12వేలు, యువతులకు సూటీలు, విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తా అని ఎందుకు ప్రమాణం చేస్తలెవ్.? అని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు.
వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి, మాట తప్పావని, హామీలను ఫలానా తేదీలోగా పూర్తిచేస్తానని ఎందుకు దేవుళ్ల మీద ఒట్టు వేస్తలెవ్.? అని ప్రశ్నించారు. ఎగ్గొట్టేవాడే ఎకువగా ప్రమాణాలు చేస్తడని, అట్లనే రేవంత్‌రెడ్డి కూడా కచ్చితంగా ఎగ్గొడతాడు కాబట్టే, కనిపించిన ప్రతీ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని, రేవంత్‌రెడ్డి ముఖంలో, మాటల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని, ఎలాగైనా నమ్మించాలని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తమను నమ్మడం లేదనే విషయాన్ని, తనకు తానే బయటపెట్టుకుంటున్నారన్నారు.