ములుగు, ఫిబ్రవరి 6(నమస్తేతెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో గ్రామసభలో అధికారుల ఎదుటే పురుగులమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం జీపీ పరిధి కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు (నాగయ్య) జనవరి 23న నిర్వహించిన గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాకపోవడంతో అధికారులను నిలదీశాడు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయని, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎలా వస్తాయని ప్రశ్నించాడు. నిరుడు తన ఇల్లు కాలిపోయిన ఫొటోలను అధికారులకు చూపించారు. తన చావుతోనైనా అర్హులకు పథకాలు ఇవ్వాలని చెప్పి పురుగులమందు తాగాడు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బాధిత కటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి మాట్లాడారు. 15 రోజులుగా మృత్యువుతో పోరాడిన నాగయ్యకు బీఆర్ఎస్ అండగా నిలిచినప్పటికీ ప్రాణాన్ని కాపాడలేకపోయామని విచారణ వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.
తండ్రి మృతితో తాము రోడ్డున పడ్డామని నాగేశ్వరరావు పెద్ద కూతురు పూజ బోరున విలపించింది. తండ్రిని బతికించేందుకు దవాఖాన ఖర్చులకు అప్పులు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు(లక్ష్మీనరసింహారావు) ధైర్యం చెప్పి 2.5 లక్షల పైనే సాయం అందించారని తెలిపారు. ఆయన అందుబాటులో లేనప్పుడు వారి తమ్ముడు ప్రదీప్‌రావు దవాఖానలో దగ్గరుండి అన్నీ చూసుకున్నారని తెలిపింది. వైద్యం కోసం రూ. 8 లక్షల వరకు ఖర్చు అయిందని, ప్రభుత్వం స్పందించి వైద్యకోసం చేసిన అప్పులను తీర్చి ఆదుకోవాలని కోరింది.
ప్రజాపాలన పేర గ్రామసభలు పెట్టి అర్హులను విస్మరించడంతోనే కుమ్మరి నాగేశ్వర్రావు ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నాగేశ్వరరావు మృతి ఈ అసమర్థ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. గ్రామసభలో అధికారులు చదివిన లిస్టులో తనపేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తంచేశారు.
దళిత బిడ్డ కుమ్మరి నాగేశ్వర్రావు మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంజీఎంలో మృతదేహాన్ని సందర్శించి, నాగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో రేవంత్ సర్కారు పేదల ప్రాణాలు తీస్తున్నదని మండిపడ్డారు. నాగయ్య ప్రాణా లు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఎంతో ప్రయత్నించారని, దురదృష్టవశాత్తు ఆయన ప్రాణాలు వదలడం బాధాకరమని తెలిపారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, నమ్మి ఓటు వేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు.