హైదరాబాద్, మే 24(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాన్ని మొన్నటి క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించకపోవడం తగదని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రోజుల తరబడి రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే సివిల్ సైప్లె మంత్రి మాత్రం గాలిలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.
కొనుగోలులో జాప్యం వల్ల తేమ శాతం తగ్గిపోయి క్వింటాల్‌కు 10 కిలోల తరుగుపోయి రూ.250 నష్టం వస్తుందని తెలిపారు. రైతు నష్టపోయే నగదును ఆర్ఆర్ ట్యాక్స్‌గా పరిగణించాల్సి వస్తుందని చెప్పారు. 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని సివిల్ సైప్లె మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబితే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం 75లక్షల మెట్రిక్ టన్నులకు కు దించారంటూ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మిగతా 15లక్షల టన్నులు ఎవ రు కొనాలని ప్రశ్నించారు. ఇంకా 40 లక్ష ల టన్నుల ధాన్యం కేంద్రాల్లోనే మూలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వడ్లు కొనకపోవడంతో కుప్పల వద్దే రైతులు మృత్యువాతపడుతున్నారని, బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామని హరీశ్‌రావు ఉన్నమాటంటే మంత్రి శ్రీధర్‌బాబు ఎందు కు ఉలికిపడుతున్నరో అర్థంకావడం లేదని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మే 31లోగా రోజుకు 5 క్వింటాళ్ల చొప్పున ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.