మహబూబాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి వేలాదిగా తరలిరావాలని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో భాగంగా గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో, గూడూరు మండలంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
ఆయా కార్యక్రమాల్లో సత్యవతి మాట్లాడుతూ.. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25వసంతాల సభను కార్యకర్తలంతా విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు సభా సమయానికి మూడుగంటల ముందే చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. మానుకోట నియోజకవర్గానికి ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా ఎక్కువ మందిని తరలిస్తామని చెప్పారు.
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 10: ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజత్సోతవ సభను పండుగ వాతావరణంలో నిర్వహించుకుందామని మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువా రం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి మూడువేల మంది కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నా రు. త్వరలో మహబూబ్‌నగర్‌లోనూ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.
నారాయణ పేట, ఏప్రిల్ 10: హనుమకొండ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సింగారం చౌరస్తాలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే పార్టీ సభ్యత్వ కార్యక్రమం డిజిటల్ రూపంలో ఉంటుందని, మొదటి సారిగా విద్యార్థి సభ్యత్వం కూడా ఉంటుందని తెలిపారు.
మెట్పల్లి రూరల్, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సకల జనులు ఉత్సాహం చూపుతున్నారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే సభకు ఖర్చులను విరాళంగా అందిస్తున్నారు. గురువారం మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని కేఎన్ రెడ్డి గార్డెన్స్‌లో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా.. బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్చుల కోసం మల్లాపూర్ మండలం ముత్యంపేట ఆటో కార్మికులు రూ. 5 వేలు విరాళంగా అందజేశారు. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మల్లాపూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు సైతం సభ ఖర్చుల కోసం విరాళాలను అందించారు.
వికారాబాద్, ఏప్రిల్ 10, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి 200 బస్సులు సమకూర్చినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో తాండూర్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ప్రతీ గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం చలో వరంగల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
భూత్పూర్, ఏప్రిల్ 10 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27 నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, శ్రేణులు భారీగా తరలిరావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్లో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏండ్ల కిందట బీఆర్ఎస్ పుట్టకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్తూరు బస్వరాజ్‌గౌడ్, నాయకులు జెట్టి నర్సింహారెడ్డి, వామన్‌గౌడ్, తోకల శ్రీనివాస్‌రెడ్డి, తోట రాముడు, బాలవర్ధన్‌గౌడ్, యాదగిరి పాల్గొన్నారు.
చిల్పూరు, ఏప్రిల్ 10 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రూ.100 కోట్లకు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తి కడియం శ్రీహరి ..దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ జెండాపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల కాలంలోనే 468మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రజతోత్సవ మహాసభకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి 35వేల మందిని తరలించాలని సూచించారు.