BRS | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొత్త రికార్డులను సృష్టించింది. దేశ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పడంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే సాటి అని ఈ సభతో మరోమారు నిరూపించారు. భారీ బహిరంగ సభలు నిర్వహించటంలో బీఆర్ఎస్కు సాటి మరెవ్వరూ లేరని ఈ సభతో మరోమారు తెలిసొచ్చింది. ఇవేమీ అతిశయోక్తులతో చెప్తున్న మాటలు కానేకాదు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ జరిగిన పలు చారిత్రక సభలను తరిచి చూసినా.. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నుంచి దేశీయంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకూ ఇలా రాజకీయ ఉద్దండులు నిర్వహించిన భారీ సభలను లెక్కేసినా.. ఆయా సభల కంటే ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎక్కువ మంది ప్రజలు వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్బాట్లు, ప్రధాన మీడియా చెప్తున్న వాస్తవమిది. అంతేకాదు.. ఆదివారం సాయంత్రం రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని తెలంగాణ జనాభాలో ప్రతీ పది మందిలో నలుగురు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చూశారు. ఇది వాస్తవం.
ప్రతీ ఇంట్లో కేసీఆర్ ప్రసంగమే..
ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహా సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. గ్రోక్, చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్బాట్ల అంచనా ప్రకారం సభా ప్రాంగణంలో 15 లక్షల మంది ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, సభకు హాజరుకాలేని కోట్లాది మంది టీవీలు, డిజిటల్ మీడియా, సోషల్‌మీడియా వేదికల ద్వారా కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్‌లో వీక్షించారు. తెలంగాణలోని ప్రధాన మీడియా ఛానళ్లలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని వార్తా ఛానల్స్ కూడా కేసీఆర్ ప్రసంగాన్ని టీవీల్లో లైవ్‌లో ప్రసారం చేశాయి. ఇలా టీవీల్లో లైవ్ ప్రసారాలను దాదాపు 1.2 కోట్ల మంది ప్రజలు చూసినట్టు సమాచారం. టీ న్యూస్‌తో పాటు పేరున్న మరో ఐదు న్యూస్ ఛానల్స్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేసిన కేసీఆర్ ప్రసంగానికి రియల్ టైమ్ వ్యూస్ 5 లక్షల వరకూ వచ్చాయి. అలా మొత్తంగా యూట్యూబ్‌లో కేసీఆర్ ప్రసంగాన్ని రియల్ టైమ్‌లో దాదాపు 12 లక్షల మంది వీక్షించారు. ప్రధాన ఛానల్స్‌కు చెందిన ఎఫ్బీ, ఎక్స్ ఖాతాల్లో మరో 3 లక్షల రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. ఇలా మొత్తంగా గంటపాటు సాగిన కేసీఆర్ ప్రసంగానికి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఖాతాల్లోని అన్ని అకౌంట్లలో కలిపి కనీసం 15 లక్షల వరకూ రియల్ టైమ్ వ్యూయర్ షిప్ వచ్చినట్టు తెలుస్తున్నది. ఇలా మొత్తంగా కేసీఆర్ ప్రసంగాన్ని 1.5 కోట్ల మంది వీక్షించినట్టు గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
బీఆర్ఎస్ గత సభలదీ రికార్డే
ఈ రజతోత్సవ సభ మాత్రమే కాదు.. గడచిన 24 ఏండ్ల ప్రయాణంలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రతీ సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన సభ సక్సెస్‌తో బీఆర్ఎస్ తన రికార్డుల పరంపరను మొదలు పెట్టింది. 2003లో వరంగల్ వేదికగా నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర సభ తెలంగాణవాదాన్ని జాతీయస్థాయిలో బలంగా వినిపించింది. ఆ సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ, నాటి కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌లు ఈ సభకు హాజరైన విషయం తెలిసిందే. అప్పటి వరకూ దేశంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఇదే అతి పెద్ద భారీ బహిరంగ సభగా రికార్డు నెలకొల్పింది. తెలంగాణ జైత్రయాత్ర సభ సూపర్ హిట్‌తోనే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను నాటి సీఎం వైఎస్ఆర్ కొనుగోలు చేసి తెలంగాణవాదం లేదని నిరూపించే కుట్ర చేసినప్పుడు 2007లో వరంగల్‌లో నిర్వహించిన ‘తెలంగాణ విశ్వరూప సభ’ బ్రహ్మాండంగా విజయం సాధించింది. ఈ సభ ద్వారా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారనే సంకేతాలు రాజకీయ వర్గాల్లో బలంగా వెళ్లాయి. 2009 డిసెంబర్ 9న అప్పటి యూపీఏ-1 సర్కారు ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసి.. అనంతరం సమైక్యాంధ్ర ఉద్యమంతో యూటర్న్ తీసుకుంటే… 2010 డిసెంబర్ 16వ తేదీన 15 లక్షల కంటే ఎక్కువ మందితో బీఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ మహాగర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. భారీ బహిరంగ సభల్లో ఇది రికార్డు. ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆ రికార్డులను తిరగరాసింది.
అమెరికా అధ్యక్షుడితో సమానంగా..
2017లో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారిగా బాధ్యతలు చేపడుతూ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మందికి పైగా వీక్షించారు. ప్రత్యక్షంగానే కాకుండా టీవీల్లో, ఆన్లైన్లో ఇలా పలు మాధ్యమాల ద్వారా ప్రజలు ట్రంప్ ప్రసంగాన్ని వీక్షించారు. అధ్యక్షుడి ప్రసంగాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలన్న నిబంధన అమెరికాలో ఉన్నది. కాబట్టి, ఫాక్స్, సీఎన్ఎన్, ఎంఎస్ఎన్బీసీ తదితర చానల్స్ ట్రంప్ ప్రసంగాన్ని కేబుల్ నెట్వర్క్లలోనే కాకుండా డిజిటల్ మీడియా వేదికల్లోనూ ప్రసారం చేశాయి. తన పదవీ స్వీకార కార్యక్రమానికి 15 లక్షల మంది వచ్చినట్టు ట్రంప్ స్వయంగా తెలిపారు కూడా. అయితే, నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ వంటి ఓ రాజకీయ పార్టీ పెట్టిన సభకు లక్షలాది మంది రావడం, అమెరికా అధ్యక్షుడితో సమానంగా కేసీఆర్ ప్రసంగాన్ని 1.5 కోట్ల మంది వీక్షించడం విశేషం.
ట్రంప్ సభ అలా..
కేసీఆర్ సభ ఇలా..
ఇందిరా గాంధీ, మోదీలను తోసిరాజని..
ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో ప్రధాని మోదీ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు 5 లక్షల మంది వరకు హాజరయ్యారు. ఇక, 1971లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో భారీ బహిరంగ సభలను నిర్వహించారు. ఒక్కో సభకు 2 లక్షల మంది చొప్పున జనం హాజరయ్యారు. ప్రధానులంతటి వారు పాల్గొన్న సభలకు 5 లక్షల మంది మాత్రమే హాజరవ్వగా, కేసీఆర్ ప్రసంగాన్ని చూడటానికి లక్షలాది మంది ప్రజలు కదిలిరావడం గమనార్హం.
కేసీఆర్ రజతోత్సవ సభకు హాజరైన జనం- 15 లక్షల మందికి పైగా ..(గ్రోక్, చాట్‌జీపీటీల అంచనా.. అంతకంటే ఎక్కువ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా)
సభ పేరు
తెలంగాణ మహాగర్జన సభ
సంవత్సరం: 2010
వేదిక: వరంగల్
హాజరైన జనం: 15 లక్షలు
సభ పేరు
తెలంగాణ జైత్రయాత్ర సభ
సంవత్సరం: 2003
వేదిక: వరంగల్
హాజరైన జనం: 5 లక్షలు
2013 ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం అతి పెద్ద జన సమీకరణ సభలు
సభ పేరు:
తెలంగాణ మహా గర్జన
(ప్రత్యేక రాష్ట్రం కోసం..)
సారథి: కేసీఆర్
సంవత్సరం: 2010
ప్రాంతం: వరంగల్
హాజరైనవారు: 15,00,000
సభ పేరు
యాంటీ వార్ ప్రొటెస్ట్ (ఇరాక్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ..)
సారథి: పౌర హక్కుల నేతలు
సంవత్సరం: 2003
ప్రాంతం: సిడ్నీ, ఆస్ట్రేలియా
హాజరైనవారు: 5,00,000
సభ పేరు
ఆరెంజ్ రెవల్యూషన్ (ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ..)
సారథి: పౌర హక్కుల నేతలు
సంవత్సరం: 2004
ప్రాంతం: ఉక్రెయిన్
హాజరైనవారు: 5,00,000
సభ పేరు
ఐ హ్యావ్ ఏ డ్రీమ్ స్పీచ్ (పౌర హక్కుల పోరాటం)
సారథి: మార్టిన్ లూథర్ కింగ్
సంవత్సరం: 1963
ప్రాంతం: వాషింగ్టన్, అమెరికా
హాజరైనవారు: 2,50,000
సభ పేరు
ది అరబ్ స్ప్రింగ్ (అవినీతికి వ్యతిరేకంగా..)
సారథి: పౌర హక్కుల నేతలు
సంవత్సరం: 2011
ప్రాంతం: లిబియా, ఈజిప్ట్
హాజరైనవారు: 1,00,000
ర్యాలీ పేరు
ఉప్పు సత్యాగ్రహం (ఉప్పుపైన పన్ను రద్దు కోసం)
సారథి: మహాత్మా గాంధీ
సంవత్సరం: 1930
ప్రాంతం: గుజరాత్
హాజరైనవారు: 60,000