Rajatotsava Sabha | (ఎల్కతుర్తి నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్): ఓరుగల్లు తెలంగాణ గొంతుకై గర్జించింది. జనపోరు కెరటమై హోరెత్తింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో 2010 డిసెంబర్ 16న ఇదే వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ‘తెలంగాణ మహాగర్జన’ను తలపించేలా ఆదివారం ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ ప్రతినబూనింది. మండుటెండను సైతం లెక్కచేయక లక్షలాదిగా తరలివచ్చిన జనసంద్రం ఏనాటికైనా తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సేనని తేల్చిచెప్పింది. అశేష జనవాహిని, ఉప్పొంగిన జనసందోహాన్ని చూసిన పార్టీ అధినేత కేసీఆర్ ఉద్విగ్నభరితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన మినహా తనకేవీ ప్రీతిపాత్రమైనవి కావని, అదే తనకు వెయ్యి జన్మల పుణ్యఫలమని పేర్కొనప్పుడు ఒకింత గద్గద స్వరంతో ఉన్నా… గడచిన 17 నెలలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఉగ్రరూపం దాల్చా రు.
దసరా పండుగనాడు పాలపిట్టను చూసినట్టు.. జమ్మికొమ్మను తాకినట్టు బహిరంగ సభా వేదిక మీద గులాబీ నాయకగణమే కాదు.. సభాప్రాంగణంలో ఉన్న ప్రతీ ఒక్కరూ కేసీఆర్‌ను చూసి పులకించిపోయారు. ఆయన చెప్పిన మాటలను చెవులొగ్గి విన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతిస్పందించారు. ఎల్కతుర్తి చుట్టూ దాదాపు 20 కిలోమీటర్ల పరిధి వరకు బీఆర్ఎస్ రజతోత్సవ శోభ సంతరించుకున్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేట, స్టేషన్‌ఘన్‌పూర్, నర్సంపేట, జనగామ, వర్దన్నపేట, పరకాల, హుజూరాబాద్, హుస్నాబాద్ వయా ముల్కనూర్ దాకా ఉన్న చౌరస్తాలన్నీ గులాబీమయ ం అయ్యాయి. పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేత హరీశ్‌రావు సహా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతల ఫొటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇక సభా ప్రాంగణంలో గులాబీవనంలా జనసందోహం విరబూసింది.
కండ్లు చెదిరే ఏర్పాట్లు- మినీ టెక్నోహబ్
భారీ బహిరంగ సభలు నిర్వహించటంలో బీఆర్ఎస్ ట్రెండ్ సెట్టర్. రజతోత్సవ ఏర్పాట్లను చూస్తే అదే నిజమని మరోసారి తేలిపోయింది. ఎల్కతుర్తి బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అసాధారణ ఏర్పాట్లు చేశారు. దాదాపు నెల రోజుల నుంచి పార్టీ ముఖ్యనేతలే కాకుండా దాదాపు వేయ్యి మంది గులాబీ సైన్యం కష్టపడి చేసిన ఏర్పాట్లకు ఫలితం దక్కిందనే చెప్పాలి. రాష్ట్ర నలుమూలల వచ్చే వాహనాల రూట్మ్యాపింగ్, అక్కడి నుంచి తిరిగి వెళ్లేప్పుడు పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటంతో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ట్రాఫిక్‌జాం కాకుండా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కోసం క్రెయిన్స్నూ సిద్ధం చేసుకోవటం విశేషం. ‘మినీ కమాండ్ కంట్రోల్’ సెంటర్ నుంచి సంబంధిత రూట్లలో ఉన్న వలంటీర్స్‌కు సమాచారం ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లు విజయవంతమయ్యాయి. అలాగే సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ (50*20) స్క్రీన్లతోపాటు ముల్కనూర్, హుజూరాబాద్, హనుమకొండ ప్రధాన రహదారులవైపే కాకుండా పార్కింగ్ స్థలాల్లోనూ మీడియం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయటం వల్ల ఎక్కడిక్కడ ఉన్నవారికి సౌకర్యవంతమైంది. ఇక సభాప్రాంగణం.. మహానగరాన్ని తలపించేరీతిలో మిరమిట్లు గొలిపేలా వెలుగులు విరజిమ్మాయి.
అనేక ప్రశ్నలకు సమాధానాలు..
ఎలతుర్తి సభా ప్రాంగణం నుంచి కేసీఆర్ అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేస్తున్న మోసాన్ని, ద్రోహాన్ని చీల్చిచెండాటంతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీ పదే పదే కేసీఆర్ ఎక్కడున్నారంటూ చేస్తున్న వ్యాఖలకు దీటుగా సమాధానం చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏమి మాట్లాడొద్దని కొంత కాలం ఓపిక పట్టామని ఇక సహించేది లేదని ప్రకటించారు. మరోవైపు బీజేపీపై కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డప్పుడు జనం నుంచి అదే స్పందన వచ్చింది. కేసీఆర్ ఇన్నాళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నకు కూడా ఆయనే సమాధానం ఇచ్చినట్టయ్యింది.
రజతోత్సవం.. రణ సంతకం
బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైంది. ఊహించిన దానికంటే అశేషంగా జనవాహిని తరలిరావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. కిక్కిరిసిన సభ ప్రాంగణం రాష్ట్ర ప్రభుత్వంపై రణ సంతకం చేసింది. అధినేత కేసీఆర్ రణనినాదం చేశారు. కాంగ్రెస్, బీజేపీలపై సింహగర్జన చేశారు. తెలంగాణ ప్రజల పరిరక్షణకు బీఆర్ఎస్ పునరంకితం అవుతుందని పోరాట ప్రతిజ్ఞ చేశారు. అదేసమయంలో ఎట్లున్న తెలంగాణ.. ఎట్లాయిపాయేనని ఆవేదన చెందారు. మరోవైపు రెట్టించిన ఉత్సాహంతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అభయమిచ్చారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా తెలంగాణను బాగు చేసుకుందామని భరోసా ఇచ్చారు. ఇక నుంచి జనంలోకి వస్తానని తేల్చిచెప్పారు. కేసీఆర్ ప్రసంగిస్తున్నసేపు సీఎం.. సీఎం అని ప్రజలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. సోషల్‌మీడియా వారియర్స్‌పై కేసులు పెడతారా? అని కేసీఆర్ నిలదీస్తున్నప్పుడు సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. డైరీలో రాసి పెట్టుకుంటామని కేసీఆర్ చెప్పగానే.. రాసిపెట్టుకోవాలి.. రాసిపెట్టుకోవాలి.. అని నినదించారు.