నల్లగొండ సిటీ అక్టోబర్ 5: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో తిప్పర్తి మండల నాయకులతో ఆయన ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ఎన్నో హమీలు ఇచ్చారని, తీరా గద్దెనెక్కాక విస్మరించారన్నారు. రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పాటు తులం బంగారం ,రైతుబంధు, యువతులకు స్కూటీలు అందించకుండా దగా చేసిందని గుర్తుచేశారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యూరియా కోసం రైతులు నిద్రాహరాలు మాని షాపుల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడితే బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందన్నారు. గ్రామాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై చర్చించుకోవాలని, విజయానికి అవసరమైన గ్రామ స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కటికం సత్తయ్యగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, కందుల లక్ష్మయ్య,పల్రెడ్డి రవీందర్‌రెడ్డి,తండు నర్సింహగౌడ్,లోడంగి గోవర్ధన్,నాగేశ్వరరావు ఉన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలిమాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మాడ్గులపల్లి, అక్టోబర్ 5: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఇందుగులలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌లో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు సంవత్సరాల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేరవేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో మండలం ఉన్నప్పటికీ మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి మండలాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, మాజీ జడ్పీ కోఆప్షన్ మెంబర్ మొహిసిన్ అలీ, నాయకులు నిమ్మల నవీన్‌రెడ్డి, వివేక్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వెన్న శ్రవణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పోకల రాజు, ఇంద్రారెడ్డి, పగిళ్ల సైదులు, జెర్రిపోతుల రాములుగౌడ్, చింతరెడ్డి యాదగిరిరెడ్డి, సింగం శివ, గడ్డమీది సైదులు పాల్గొన్నారు.