తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు 2001 ఏప్రిల్ 27. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన రోజు అది. తెలంగాణ ప్రాంతంలో ఆట, పాట బంద్ అయ్యి, ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి చెప్పుకొని కన్నీరు కార్చే అవకాశం లేని కాలం. సమైక్య పాలనలో పల్లె ప్రజలపై జరుగుతున్న దాష్టీకాలు, నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువకులను ఎన్కౌంటర్ల పేరిట పిట్టల్లా కాల్చిచంపడం, తెలంగాణ అంటే నక్సలైట్ అని ముద్ర వేయడం, ఉంటే జైల్ లేకుంటే అడవి అనే గ్రామీణ ముఖచిత్రం.. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అన్ని హక్కులు కాలరాయబడి తీవ్ర అణచివేతలతో తల్లడితున్న చారిత్రక సందర్భం. అలాంటి సమయంలో ప్రజల ఆకాంక్షల పురిటినొప్పులతో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడుపోసుకుంది.
తెలుగుదేశం పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని డిప్యూటీ స్పీకర్ హోదాలో కేసీఆర్ అనేకసార్లు ఎదిరించారు. ప్రజల సమస్యలపై నిరంతరం వివిధ వర్గాలతో చర్చించేవారు. ఈ నేపథ్యంలో సమైకాంధ్ర పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని నిర్ణయించుకున్నారు. అందుకు సరైన సమయం కోసం వేచిచూస్తున్నారు. ఆ సందర్భంలో విద్యుత్తు సంస్కరణల పేరిట టీడీపీ సర్కారు చార్జీల పెనుభారాన్ని మోపడంతో కేసీఆర్ వెంటనే లేఖాస్త్రం సంధించారు. విద్యుత్తు చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం సమైకాంధ్ర పాలకుల్లో అలజడి సృష్టించింది. ఈ నేపథ్యంలోనే స్వరాష్ట్ర సాధన ద్వారానే తెలంగాణ ప్రజలకు విముక్తి లభిస్తుందని నిశ్చయించుకొని తన పదవులకు రాజీనామా చేశారు. అలా తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీ ఏర్పాటు చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రోజే ఏప్రిల్ 27. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ రాజకీయ గొంతుగా ఉద్భవించింది. తెలంగాణ బహిరంగ జైల్‌గా మారింది. విప్లవ ప్రజాసంఘాల ప్రభావంతో జరుగుతున్న ఆందోళనలను అణచివేయడానికి పల్లెలన్నీ పోలీస్ క్యాంపులుగా మారిపోయాయి. అణచివేత, నిర్బంధం రాజ్యమేలుతున్న తరుణంలో ప్రజలకు టీఆర్ఎస్ రాజకీయ ఆయుధంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తిరిగి ప్రజ్వలింపచేసి, శాంతియుత ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, గాంధేయ మార్గంలో అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని కేసీఆర్ తీసుకున్న ఉద్యమ ఎజెండా అన్ని వర్గాలను ఏకతాటిపైకి నడిపించింది. ఎన్నికలను కూడా ఒక ఉద్యమ పోరాటరూపంగా మార్చి తద్వారా వివిధ రాజకీయ పార్టీలపై, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి లక్ష్యాన్ని చేరుకోవాలనే మార్గంతో కొందరు విభేదించినా.. కేసీఆర్ ఎంచుకున్న మార్గం రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించింది. లక్షలాది మందితో నిర్వహించిన సభలు, ర్యాలీలు, బస్సు యాత్రలు, పాదయాత్రలు, సడక్ బంద్, సాంస్కృతిక ప్రదర్శనలు, సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సంసద్ యాత్రలు అందర్నీ ఏకం చేశాయి. రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేననే విస్తృత అభిప్రాయం వ్యక్తమయ్యేందుకు దోహదం చేశాయి.
టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో గ్రామాల్లో బలమైన పునాదికి మార్గం సుగమమైంది. 2004
సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు లేకుండా తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి లేని రాజకీయ వాతావరణం ఏర్పడింది.
తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఆకాంక్షకు కాంగ్రెస్ మద్దతు పలికింది. తద్వారా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ అంశాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చింది. టీఆర్ఎస్ ఒత్తిడితో ప్రణబ్ నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్, ఆచార్య జయశంకర్ 32 రాజకీయ పార్టీలను కలిసి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు తీసుకొని ప్రణబ్ కమిటీకి అందించారు. రాష్ట్ర ఏర్పాటుకు దేశ స్థాయిలో జరిగిన మొదటి రాజకీయ ప్రక్రియ ఇదే కావడం గమనార్హం. కాంగ్రెస్ మరోసారి మోసం చేయడంతో సంకీర్ణం నుంచి టీఆర్ఎస్ వైదొలిగింది.
మంత్రి పదవులను త్యజించడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మరింతగా పెంచింది. 2009 ఎన్నిక ల్లో టీడీపీ చేత తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించినప్పటికీ ఆ పార్టీ రాజకీయ కుట్రలకు పాల్పడటంతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ రెండు పార్టీలు మొదట ‘జై తెలంగాణ’ ఆ తర్వాత ‘నై తెలంగాణ’ అనడంతో యావత్ తెలంగాణ కేసీఆర్ వెంట నడిచే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేయడంతో తెలంగాణలో ఆందోళనలు పెల్లుబికాయి. కేసీఆర్ నాయకత్వంలో 2008 అక్టోబర్ 21న సిద్దిపేట ఉద్యోగ గర్జన సభను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిర్వహించారు. కేసీఆర్ ఇచ్చి న పెన్ డౌన్ పిలుపు ఉద్యోగులకు మరింత ఉత్సాహా న్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 27న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం తో తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరుకున్నది. కేసీఆర్ అరెస్ట్ కాగానే తెలంగాణ ఉద్యోగులు పెన్ డౌన్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు.
కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో ఏదైనా జరిగితే తమకు శాశ్వత రాజకీయ సమాధి తప్పదని, 2009 డిసెంబర్ 29 అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. దాంతో కేసీఆర్ దీక్ష విరమించారు. కానీ వంచనకు బ్రాండ్ అంబాసిడర్ అయిన కాంగ్రెస్ వెనక్కి తగ్గడంతో మరోసారి తెలంగాణ యుద్ధ భూమిగా మారిం ది. అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాలని జేఏసీని స్థాపించిన కేసీఆర్ ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చు ట్టారు. సకలజనుల సమ్మె, సాగరహారం, సంసద్ యా త్ర వంటి కార్యక్రమాలు, కేసీఆర్ చేసిన రాజకీయ పోరాటం ఫలించి తెలంగాణ స్వప్నం సాకారమైంది. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నట్టు.. తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి, తన జీవిత కాలంలో అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న అద్భుతమైన నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీని గెలిపించి, పదేండ్లపాటు ఉద్యమ సారథికే పాలనా పగ్గాలు అప్పగించడం మరో చరిత్ర. పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానానికి లభించిన గొప్ప అవకాశం. ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 27 వస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ జబ్బకు సంచి చేతిలో జెండా పట్టుకొని ‘జాతర పోదమా.. తెలంగాణ జాతర పోదమా..’ అన్నట్టు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిపోవాలి.
-దేవీప్రసాద్