హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సుందరీకరణ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులందరికీ సోమవారం ఆయన లేఖ రాశారు. సరైన పరిహారం, కనీస సంప్రదింపులు లేకుండా బలవంతంగా ఖాళీ చేయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని విమర్శించారు. కూల్చివేతలు సీఎం రేవంత్‌రెడ్డి నియంత్రత్వానికి పరాకాష్టగా అని అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను అనుసరించి బుల్డోజర్రాజ్ను తెలంగాణలోకి తెచ్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని పేర్కొన్నారు. కూల్చివేతలను ఆపాలని, జీవో 477ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.