హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో దళిత గిరిజన అగ్రనేతలకే అడ్రస్‌లేదని, అలాంటిది ఇప్పుడు డిక్లరేషన్ల పేరుతో పేద దళితులను దగాచేస్తారా? అని బీఆర్ఎస్ సీనియర్‌నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజనరసింహకు గాంధీభవన్‌లో కనీసం సన్మానం చేయకుండా అవమానించిన రేవంత్ కాంగ్రెస్‌కు దళిత గిరిజనుల గూర్చి మాట్లాడే హకు లేదని సోమవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార పాదయాత్రను పొంగులేటి పాలపొంగుతో అవమానించారని గుర్తుచేశారు. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, సీనియర్ నేత గీతారెడ్డిని కూడా అవమానించారని, అలాం టి రేవంత్‌కు గిరిజనుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా పనిచేసి జాతీయస్థాయిలో లంబాడా నేతగా గుర్తింపు పొందిన బలరాంనాయక్‌కు ఏ పదవీ ఇవ్వకుండా అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నంది ఎల్లయ్యను కాంగ్రెస్ మంత్రిని కూడా చేయలేకపోయిందని విమర్శించారు. దళిత గిరిజన నాయకులను, ఎమ్యెల్యేలను బానిసలుగా చూసే ఫ్యూడల్ వ్యవస్థను నడిపే రేవంత్ కాంగ్రెస్‌కు దళిత గిరిజనుల గూర్చి మాట్లాడే హక్కులేదన్నారు.