హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): లగచర్ల ఏమైనా నియంత్రణ రేఖనా (ఎల్వోసీ), అక్కడి గిరిజనులు దేశద్రోహులా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బందిపోట్లు, దేశద్రోహుల కన్నా ఘోరంగా లగచర్ల గిరిజనులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో గిరిజన నాయకులు రామచంద్రునాయక్, వాల్యానాయక్, రూప్‌సింగ్‌నాయక్, రాంలాల్‌నాయక్, లక్ష్మానాయక్, మోహన్‌నాయక్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గిరిజనులపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లగచర్లలో జరిగిన దాడి మణిపూర్‌లో జరుగుతున్న దాడులకు ఏమాత్రం తీసిపోదని పేర్కొన్నారు. ఫార్మా కోసం భూములివ్వబోమని గిరిజనులు చెప్పిన పాపానికి రేవంత్‌రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్‌పై దాడి జరగకున్నా జరిగినట్టు చిత్రీకరించి గిరిజనులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ వంటి వాళ్లను సైతం వెళ్లనీయడం లేదంటే లగచర్లలో జరుగుతున్న దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలని కోరారు. సీఎం సొంత నియోజకర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్టంలో గిరిజనులు, మహిళలు, పౌరులపై జరుగుతున్న దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో జాతీయ సంస్థలు గుర్తించాలని కోరారు. పదేండ్లు తెలంగాణను సుభిక్షంగా, సుసంపన్నంగా తీర్చిదిద్దిన కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా చేయడమే పాలనగా రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. కప్పం కట్టేందుకు రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లే సమయం ఉంటుంది కానీ, లగచర్ల వెళ్లడానికి లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొంతమంది గిరిజన ద్రోహులు లగచర్లలో అసలేం జరగలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా గిరిజనులకు అండగా ఉండాలని కోరారు.
అవకాశం ఉంటే రాష్ట్రపతికి నివేదిస్తాం
రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న దాడులను దేశం దృష్టికి తీసుకెళ్లి తద్వారా వారికి న్యాయం జరిగేందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కృషిలో భాగంగా లగచర్ల బాధితుల వెంట తాము ఢిల్లీలో ఉన్నామని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్ సానుకూలంగా స్పందించాయని తెలిపారు. లగచర్ల ఘటనపై డీజీపీ, సీఎస్‌కు ఆదేశాలిస్తామని, బాధితులు ధైర్యంగా ఉండాలని ఆయా వేదికల పెద్దలు అభయం ఇచ్చారని తెలిపారు. లగచర్ల దురాగతాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.