Lagacharla : లగచర్ల ఘటనను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. లగచర్ల ఫార్మా బాధితులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని ఆ పార్టీ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. ఇప్పటికే లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ, మహిళ, మానవహక్కుల కమిషన్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై భాదితులు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో లగచర్లలో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలూకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరారు. దాంతో బలవంతపు భూ సేకరణ, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులు, లైంగిక దాడి వంటి అంశాలతో కూడిన పత్రాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేసినట్లు సమాచారం. రాష్ట్రపతిని స్వయంగా కలసి తమ గోడు వినిపించాలని, అప్పటిదాకా హస్తినలోనే ఉండాలని గిరిజన మహిళలు నిర్ణయించుకున్న నేపథ్యంలో బాధితులను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.