కోదాడ, మే 19 : విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో ప్రభుత్వాన్ని నిలదీసే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి కావాలా? బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే వ్యక్తి, 56 క్రిమినల్ కేసుల్లో నిందితుడు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాలులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. బిట్స్ పిలానీలో బంగారు పతకం సాధించి, అమెరికాలో లక్షలాది రూపాయల వేతనంతో ఉన్నత ఉద్యోగం చేసిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి సొంత గడ్డపై మమకారంతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
ఉన్నత విద్యావంతుడు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నిబద్ధతగల రాకేశ్‌రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 1.31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కటికం సత్తయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.