School Tenders Scam | హైదరాబాద్, జూన్ 13 (నమస్తేతెలంగాణ): సెంట్రలైజ్డ్ టెండర్లతో రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం జరిగిందని, ఈ ముసుగులో సుమారు రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఈ టెండర్లతో తెలంగాణ బిడ్డలైన కాంట్రాక్టర్లకు ఒరిగిందేమీలేదని, ఢిల్లీ, ముంబై, గుజరాత్‌కు చెందిన గుత్తేదారులకు తెలంగాణ సంపదను దోచిపెట్టారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, నేతలు అబ్రహంహుస్సేన్, ఆజాద్, తుంగ బాలు, గోపగాని రఘురామ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.‘ప్లేట్లు, గ్లాస్లు, కటోరీలు, స్పూన్లు, కప్ విత్ హ్యాండిల్ కాంట్రాక్ట్‌ను వరల్డ్ ఫా ఎక్స్‌ఫోర్ట్ కంపెనీకి, నోట్‌బుక్స్ టెండర్ ముంబైకి చెందిన సంతన్ ఓవర్సీస్కు, పీఈటీ డ్రెస్, ట్రాక్ సూట్, నైట్ డ్రెస్ గుజరాత్‌కు చెందిన మఫత్‌లాల్ ఇండస్ట్రీస్‌కు, స్కూల్ బ్యాగులు, షూ, టైలు ముంబైకి చెందిన క్షిప్రా ఎంటర్‌ప్రైజెస్‌కు, కార్పెట్, బెడ్‌షీట్, టవల్, బ్లాంకెట్లు సహా యూనిఫామ్ క్లాత్‌లు మఫత్లాల్కు, ట్రంక్ బాక్సులు చింతామణి పరాస్వంత్ ఎంటర్‌ప్రెజెస్ (దీని వెనుక రమేశ్జైన్ ఉన్నరు), ఐడీ కార్డు హోల్డర్ కేంద్రియ భండార్ (వెనుక రమేశ్జైన్)కు ఇలా బడా కంపెనీలకే సర్కార్ కట్టబెట్టిందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణకు చెందిన 10 వేల మంది చిరు కాంట్రాక్టర్లను బతికించారని, కానీ రేవంత్ ఆ చిరు కాంట్రాక్టర్ల ఉపాధిని దెబ్బతీసి ఢిల్లీ, ముంబై, గుజరాత్‌కు చెందిన గుత్తేదారులకు రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. మే 30న చిరు కాంట్రాక్టర్లు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్నారని భయపడి అంతకు ఒకరోజు ముందు మే 29న కేసీఆర్ పాలనలో మాదిరిగా టెండర్లు ఇస్తామని రాత్రికి రాత్రే సర్క్యులర్ జారీచేశారని చెప్పారు. పెద్ద మొత్తంలో దోచిపెట్టి చిన్నవాళ్లకు మాత్రం మిగిలిన కొంత ఇవ్వాలని నిర్ణయించారని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఏ వస్తువులు కొనుగులు చేసినా ఎంఎస్ఎంఈలకే ప్రాధాన్యం ఇవ్వాలని 2010లో అప్పటి ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కేసీఆర్ అమలు చేశారని, కానీ రేవంత్‌రెడ్డి మాత్రం వాటిని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ ప్రభుత్వంలో జూన్ వస్తున్నదంటే జనవరిలోనే గురుకుల, విద్యాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేవని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. సంక్షేమ భవన్లో యుద్ధ వాతావరణం కనిపించేదని, విద్యార్థులకు కల్పించాల్సిన వసతులపై అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగేవని గుర్తుచేశారు. సర్కార్‌కు చెందిన నయాపైసా అక్రమంగా కాంట్రాక్టుల జేబుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకొనేవారని పేర్కొన్నారు. పుస్తకాలు, బూట్లు, సాక్స్‌లు, ఆహారానికి సంబంధించిన టెండర్లను జూలై మొదటి వారంలోనే పూర్తిచేసి 3, 4 నెలల్లో బిల్లులు క్లియర్ చేసే వారమని, 99 శాతం తెలంగాణ కాంట్రాక్టర్లకే వాటిని ఇచ్చేదని, చిన్నతరహా పరిశ్రమలకే అవకాశం కల్పించేదని వివరించారు. కానీ రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఈజీగా దోచుకొనే వ్యవహారాలకు తెరలేపారని విమర్శించారు. ఇందులో భాగంగా గురుకులాలు, కేజీబీ వీలు, సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకొనే 35 లక్షల మంది విద్యార్థుల పేరిట దోచుకొనే వ్యవహారం మొదలుపెట్టారని విమర్శించారు. రేవంత్ సీఎం అయిన వెంటనే ఒక మహిళా అధికారిని గురుకులాల సెక్రటరీని చేశారని, ఆమె, రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి కుట్రపన్ని ఆరు నెలలు ఎలాంటి పనులు చేయకుండా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ డాక్యుమెంటేషన్‌ను రూపొందించారని తెలిపారు.
కుక్కను చంపేముందు పిచ్చిదనే ముద్రవేసిన చందంగా గురుకులాల్లో విషాహార ఘటనలకు కేసీఆర్ హయాంలోని కాంట్రాక్టర్లే కారణమని దుష్ప్రచారం చేసి తొలగించారని పేర్కొన్నారు. తెలంగాణ వాళ్లు నాణ్యమైన వస్తువులు సరఫరా చేయరని, ఢిల్లీ కాంట్రాక్టర్లకు వేలకోట్ల తెలంగాణ సొమ్మును కట్టబెట్టే కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. విద్యార్థులకు సంబంధించిన ట్రంకు బాక్సులు, నోట్ పుస్తకాలు, టైలు, బెల్టులు ఎన్ని కొనుగోలు చేస్తున్నారో చెప్తున్నారు కానీ, కాంట్రాక్ట్ ఎస్టిమేటెడ్ విలువను రాయడం లేదని తెలిపారు. సాల్వెన్సీ సర్టిఫికెట్ రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్లు.. టర్నోవర్ ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.150 కోట్లు అని పెట్టారు..ఈ ముసుగులో ఢిల్లీ, ముంబై కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. వారి నుంచి కాంగ్రెస్ గద్దలు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ అక్రమ వ్యవహారాలు అడ్లూరికి తెలియదు.. బ్యాటింగ్, బౌలింగ్, స్క్వేర్ డ్రైవ్, కవర్‌డ్రైవ్ తప్ప అజారుద్దీన్‌కు ఇవి అసలే తెలియదని, ఈ విషయంలో ఆయన స్టంప్ అవుట్ అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ పాలనలో శ్రీ చైతన్య, నారాయణ వద్దని గురుకులాలే కావాలంటే విద్యార్థులు చేరేవారని.. కానీ రేవంత్ పాలనలో తెలంగాణ సొమ్మును దోచుకొనేందుకు ఢిల్లీ, ముంబై నుంచి కాంట్రాక్టర్లు వస్తున్నారని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణకు చెందిన మన షూస్ అనే కంపెనీ పెట్టుకొన్న ఓ మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకుడు గురుకులాలకు షూస్ సరఫరా చేస్తానని దరఖాస్తు చేయగా తిరస్కరించింది నిజంకాదా? అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. రూ.300 కోట్ల టర్నోవర్ చూపాలని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. పేద కుటుంబానికి చెందిన ఆయన అంత పెద్దమొత్తంలో టర్నోవర్ ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. అడ్లూరికి వినతిపత్రం ఇస్తే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసి చేతులు దులుపుకొన్నారు తప్పితే పట్టించుకోలేదని ఆరోపించారు. మరి రమేశ్జైన్కు ఎందుకు ఇచ్చారు? ఆయన ఏమైనా చర్మకారుడా? ఏనాడైనా చెప్పులు కుట్టారా? అని నిలదీశారు. గతంలో బంకర్బెడ్లలోనూ పెద్దమొత్తంలో దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొన్న రేవంత్‌రెడ్డిది ఆయనకంటే నీచమైన చరిత్ర అని విరుచుకుపడ్డారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తామని మోసం చేసిన ఘనుడని దుయ్యబట్టారు. రేవంత్ కనుసన్నల్లో సాగుతున్న అక్రమ వ్యవహారాలపై మంత్రి శ్రీధర్‌బాబు నోరువిప్పాలని డిమాండ్ చేశారు.
‘రెండున్నరేండ్ల ఈ కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల పరంపర కొనసాగుతున్నదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలపై సిట్ వేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బొగ్గు టెండర్ల నుంచి వట్టినాగులపల్లి భూముల వరకు యథేచ్ఛగా సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. నిలువరించాల్సిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. రేవంత్ కాంగ్రెస్‌కు వంతపాడుతూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవిత్రమైన అంబేద్కర్ సెక్రటేరియట్లో కూర్చొని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. అంకెకు, సంఖ్యకు తేడా తెలియని అమాయకులైన మంత్రులు రేవంత్ రాసిచ్చిన స్క్రిఫ్ట్‌ను చదువడంలో ఫెయిలయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్ సర్కార్ కుంభకోణాలను ఆధారాలతో బయటపెట్టిన హరీశ్‌రావుపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ‘మంత్రులకు స్క్రిఫ్ట్ రాసిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతూ వెన్నుపోట్లు పొడవడంలో రీసెర్చ్ చేస్తున్నారు..ఢిల్లీకి బ్యాగుల్లో మూటలు మోసీ, మోసీ రైతులకు గన్నీబ్యాగులు లేకుండా చేశారు’ అని దెప్పి పొడిచారు.