Gas Irregularities | మాగనూర్: మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ (Indian Gas Agency) నిర్వాహకుల తీరుపై మాగనూరు, కృష్ణా ఉమ్మడి మండలాల వినియోగదారులు, వివిధ గ్రామాల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ సకాలంలో అందక సామాన్య ప్రజలు ఆందోళన చెందుతుంటే, గ్యాస్ ఏజెన్సీ మాత్రం సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ అక్రమంగా సొమ్ము చేసుకుంటుదని వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
సాధారణ వినియోగదారులకు ‘స్టాక్ లేదు’ అని చెబుతున్న ఏజెన్సీ నిర్వాహకులు, గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్లను గుట్టుచప్పుడు కాకుండా మక్తల్, ఇతరులకు అక్రమంగా తరలించి, అధిక ధరలకు అమ్ముకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామాల నుంచి వచ్చే లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ కోసం ఫోన్ చేస్తే ఏజెన్సీ సిబ్బంది, ఆఫీస్ నిర్వాహకులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్కు వెళ్లి అడిగితే కళ్లముందే స్టాక్ కనిపిస్తున్నా, లేదంటూ అబద్ధాలు చెబుతూ రోజులు తరబడి తిప్పించుకుంటున్నారని వావారు వాపోయారు.
వినియోగదారులను తిప్పించుకుంటున్నారే తప్ప సిలిండర్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ గ్యాస్ ఏజెన్సీ వచ్చినప్పటి నుంచి తిప్పలు తప్పడం లేదని, డబ్బులు కట్టినా గ్యాస్ ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. ఈ ఏజెన్సీ సర్వీసు, నిర్లక్ష్యపు సమాధానాలకు విసిగిపోయిన పలువురు వినియోగదారులు ఇప్పటికే తమ గ్యాస్ కనెక్షన్లను ఇతర కంపెనీ ఏజెన్సీలకు మార్చుకుంటున్నారు.
నిరుపేదలు, గ్రామీణ లబ్ధిదారుల హక్కులను కాలరాస్తూ గ్యాస్ సిలిండర్లను దొంగదారిలో బ్లాక్ మార్కెట్ (Black Market)కు తరలిస్తున్న మాగనూర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీపై ఉన్నతాధికారులు (Higher Officials) వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందేలా చూడాలని మండల ప్రజలు కోరారు.